
హాత్ సే హాత్ జోడో యాత్ర. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పాదయాత్ర. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన మెసేజ్ ను దేశవ్యాప్తంగా ప్రతీ గడప గడపు చేరవేయడమే లక్ష్యం. తెలంగాణలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ఈ నెల 6న ప్రారంభం కానుంది.హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు మేడారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తన కీలక యాత్ర ఆరంభించడానికి.. తెలంగాణలో ప్రముఖ గిరిజన పుణ్యక్షేత్రమైన ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలయ్య జాతరను రేవంత్ రెడ్డి ఎంచుకోవడం ఆసక్తికరం.
ఇక్కడ ఎమ్మెల్యే సీతక్క సెంటిమెంట్ కూడా పని చేసిందని అంటున్నారు. వైఎస్సార్ కు సబితా ఇంద్రారెడ్డి ఎలాగో.. రేవంత్ రెడ్డికి సీతక్క అలాగ సోదరి సమానం. అందుకే, వైఎస్సార్ సబిత నియోజకవర్గమైన చేవెళ్ల నుంచి ఆనాడు తన ప్రజాప్రస్థాన యాత్రకు శ్రీకారం చుడితే.. ఇప్పుడు సీతక్క ఇలాఖా అయిన మేడారం నుంచి హాత్ సే హాత్ జోడో పాదయాత్రను ఆరంభించనున్నారు రేవంత్ రెడ్డి. అమ్మ వారి దీవెన.. గిరిజనుల ఆదరణ.. సీతక్క సెంటిమెంట్.. అన్నీకలిసి తన పాదయాత్రను గ్రాండ్ సక్సెస్ చేస్తాయనే ధీమా ఆయనది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేతో కలిసి ఫిబ్రవరి 6న మేడారంలో పాదయాత్ర ప్రారంభించనున్నారు రేవంత్ రెడ్డి. ఈ యాత్రకు ప్రియాంకగాంధీని ఆహ్వానించారు. మొదటి విడతలో 50 నుంచి 60 నియోజక వర్గాలు కవర్ అయ్యేలా యాత్రను ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రతో కేడర్ లో మరింత జోష్ వస్తుందని అంటున్నారు.