
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం ఉంది. ఎంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ లభిస్తుందనే విషయమై అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది. కేసీఆర్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తారా ? లేక కోత విధిస్తారా ? అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో హుజూరాబాద్ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థి విషయంలో ఆ పార్టీ ముఖ్యనేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో మరోసారి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు మాజీమంత్రి ఈటల రాజేందర్. ఉప ఎన్నికల్లో ఆయనపై బీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేశారు. అయితే గతంలో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఉప ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌లో చేరారు.
కౌశిక్ రెడ్డిని కేసీఆర్ ఎమ్మెల్సీ చేశారు. ఉప ఎన్నికల్లో మరోసారి ఈటల రాజేందర్ గెలవడంతో.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం పాడి కౌశిక్ రెడ్డికి దక్కతుందా ? లేక గెల్లు శ్రీనివాస్‌కు వస్తుందా ? అనే దానిపై డైలమా నెలకొంది. ఎవరికి వాళ్లు వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకే అని ప్రచారం చేసుకుంటున్నారు. అయితే తాజాగా జమ్మికుంట సభలో ఈ అంశంపై కేటీఆర్ స్పష్టత ఇచ్చారు. హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డి కష్టపడుతున్నారని.. ఇదే రకంగా కష్టపడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా ఆశీర్వదిస్తారని వ్యాఖ్యానించారు.
ఒకరకంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగబోయే ఈటల రాజేందర్‌పై పోటీ చేయబోయేది కౌశిక్ రెడ్డి అనే విషయాన్ని కేటీఆర్ తేల్చేశారు. దీంతో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. నిజానికి ఈటల రాజేందర్‌ను ఓడించాలనే విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం పట్టుదలగా ఉంది. అందుకే ఈ ఇక్కడ పోటీ చేయబోయే అభ్యర్థి విషయంలో పార్టీ నాయకత్వం ముందుగానే క్లారిటీ ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రకకమైన ప్రకటన చేయడం ద్వారా కౌశిక్ రెడ్డి కూడా మరింత దూకుడుగా ముందుకు సాగే అవకాశం ఉంటుందని.. నియోజకవర్గంలో పని చేసుకోవడానికి అవకాశం దక్కుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈటల రాజేందర్‌పై బీఆర్ఎస్ తరపున పోటీ చేసే దక్కించుకున్న పాడి కౌశిక్ రెడ్డి.. సీనియర్ నేతతో పోటీకి ఏ రకంగా సిద్ధమవుతారో చూడాలి.
One Comment