
క్రైమ్ మిర్రర్, నిజామాబాద్ ప్రతినిధి : కలెక్టరేట్ ఎదుట సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం చేయడం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. పెండింగ్ బిల్లులు రావడం లేదని, సంతకం చేయకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తూ నందిపేట సర్పంచ్ వాణి, ఆమె భర్త తిరుపతి (వార్డ్ మెంబర్) కలెక్టర్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామంలో రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని.. పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని తిరుపతి కంటతడి పెట్టుకున్నారు. బీజేపీ నుంచి పోటీ చేసి తన భార్యను సర్పంచ్‌గా గెలిపించుకున్న తాను గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో బీఆర్‌ఎస్ పార్టీలోకి మారితే.. చెక్ పవర్ రద్దు చేసి, సస్పెండ్ చేసి మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఓ వ్యక్తి ఆయన చేతిలో నుంచి అగ్గిపెట్టె లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం పోలీసులు, అధికారులు ఆయనకు నచ్చజెప్పి అక్కడ నుంచి తరలించారు.
Read Also : గవర్నర్ విషయంలో వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కారు… గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు
చెక్కులపై సంతకం చేయకుండా ఉప సర్పంచ్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తిరుపతి వాపోయారు. చెక్ పవర్ రద్దు చేశారని, అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. మూడేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా తన గోడు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అధికారుల చుట్టూ తిరిగి, న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని భావించి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆయన తెలిపారు. తాను 10 మందిని ఆదుకున్నానని, ఇప్పుడు తన పరిస్థితి దీనంగా మారిందని సర్పంచ్ భర్త తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. నందిపేట గ్రామస్థులు పద్మశాలి బిడ్డను ఆదరించి, గ్రామం బాగుపడుతుందని తమను గెలిపిస్తే.. ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నామని అన్నారు. గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేసిన రెండు కోట్ల రూపాయలు వడ్డీతో కలిపి రూ.4 కోట్లకు చేరిందని ఆయన అన్నారు. చేతిలో డబ్బులు లేక, పెండింగ్ బిల్లులు రాక దీనస్థితిలో ఉన్నానని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇవి కూడా చదవండి :
- మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అరెస్ట్
- కమలం పార్టీలో కోవర్టుల కలకలం…. తలలు పట్టుకుంటున్న కాషాయ నేతలు
- భారత్ జోడో యాత్ర కేవలం ఆరంభం మాత్రమే… రాహుల్ గాంధీ
- గవర్నర్‌పై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం… బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంపై పిటిషన్
- చంద్రబాబుకు రాహుల్ గాంధీ ఆహ్వానం.. ఏపీలో సంచలనం
One Comment