
నల్గొండ బీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకు తీవ్రస్థాయిలో దుమారం రేపుతుంది. తాజాగా నల్గొండ నియోజకవర్గవ్యాప్తంగా వెలిసిన పోస్టర్ల వార్ ఆ ఇద్దరు నాయకుల అనుచరుల మధ్య ఘర్షణలకు దారితీస్తుంది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చాడ కిషన్ రెడ్డి మధ్య వర్గపోరు గత కొద్ది రోజులుగా నడుస్తుంది. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదనే విమర్శ కొనసాగుతుంది. మొదటి నుంటి పార్టీలో సీనియర్ నాయకుడైన చాడ కిషన్ రెడ్డికి పార్టీ అధిష్ఠానం ఇప్పటివరకు ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంతో కోపంతో ఉన్నారు. దీంతో ఈసారి జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడుతున్నారు. దీంతో.. ప్రచారంలో భాగంగా నూతన సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా కిషన్ రెడ్డి ఫోటోతో ఉన్న వాల్ పోస్టర్లు ముద్రించి పట్టణమంతా అంటించారు. ముఖ్యమైన సెంటర్లలో పోస్టర్లు అతికించారు.
అయితే కోచింగ్ సెంటర్ పేరుతో ఉన్న పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు చాడ కిషన్ రెడ్డి పోస్టర్లపై రాత్రికి రాత్రే అంటించటం ఇప్పుడు చర్చకు దారి తీసింది. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు కావాలనే ఇలా చేశారని చాడ వర్గం ఆరోపిస్తోంది. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం తగదని హెచ్చరికలు జారీ చేస్తోంది. కాగా.. తమకు అలాంటి రాజకీయాలు చేయడం అవసరం లేదని.. భూపాల్ రెడ్డికి నియోజకవర్గంలో తిరుగులేదని ఎమ్మెల్యే తరఫు వర్గం అంటున్నారు. ఎన్ని కుట్రలు చేసినా మరోసారి తమకే టికెట్ లభిస్తుందంటున్నారు.
రానున్న రోజుల్లో ఈ రచ్చ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 10 నెలల్లో ఎన్నికలు ఉండడంతో ఎవరికి వారు సొంత ప్రచారాలు చేసుకుంటూ జనంలోకి పోతున్నారు. ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పోతుండడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి పరిణామాలు రానున్న రోజుల్లో తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.