
తెలంగాణ రాష్ట్రంలోని బిజెపిలో ఆధిపత్య పోరు కొనసాగుతుందా? బిజెపిలో రాష్ట్రంలో చక్రం తిప్పుతారని భావించిన ఈటల రాజేందర్ విషయంలో ఏం జరుగుతుంది? ఈటల రాజేందర్ పార్టీ మారతారని జరుగుతున్న ప్రచారం వెనుక కారణాలు ఏమిటి? వంటి అంశాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఆత్మగౌరవం నినాదంతో కేసిఆర్ పై హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో గెలిచి తన సత్తా చాటుకున్న నేత. ఈటల రాజేందర్ పట్ల బిజెపి అధిష్టానానికి ఒక ప్రత్యేకమైన గౌరవం, విశ్వాసం రెండు ఉన్నాయి. అందుకే పార్టీలోకి వచ్చిన అనతి కాలంలోనే ఈటల రాజేందర్ కు అనేక కీలక బాధ్యతలను అప్పగించి పార్టీని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈటెల రాజేందర్ ను చేరికల కమిటీ చైర్మన్ గా నియమించి, తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీల నుంచి కీలక నాయకులను పార్టీలోకి తీసుకురావాల్సిందిగా బాధ్యత అప్పగించారు. కానీ అయ్యాన దూకుడు చూపించలేకపోతున్నారు.
ఈటల రాజేందర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ను ఎదుర్కొనే బలమైన పార్టీగా బిజెపి ఉండడంతో, పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తులను బిజెపి బాట పట్టించడంలో బాగానే కష్టపడుతున్నారు. అయితే బిజెపిలో దూకుడు చూపిస్తున్న ఈటల రాజేందర్ జాతీయ నాయకత్వం దృష్టిలో ఉండడం, రాష్ట్ర నాయకత్వంలోని కొందరికి మింగుడు పడడం లేదన్నది పార్టీ అంతర్గత వర్గాలలో జరుగుతున్న చర్చ. ఇక ఈ క్రమంలోని ఈటల రాజేందర్ పార్టీని బలోపేతం చేయడానికి రెండు అడుగులు ముందుకు వేస్తే ఆయనను నాలుగడుగులు వెనక్కి లాగే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకుంటున్నారు.
అన్ని పార్టీలలోనూ కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేయడం, బిజెపిలోని తనని అడ్డుకుంటున్న వ్యక్తులను ఉద్దేశించి, ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలుగా భావిస్తున్నారు. ఇప్పటికే అధినాయకత్వం అప్పగించిన చేరికల పనిని సక్సెస్ చేయలేక మల్ల గుల్లాలు పడుతున్న ఈటల ఇప్పుడు కొత్తగా పార్టీ మారుతారు అన్న ప్రచారానికి చిరాకు పడుతున్నారు. తను బిజెపిని వదిలి వెళ్ళేది లేదని ఆయన తేల్చి చెబుతున్నారు. తన పైన కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడిన ఈటల తనపై కాంగ్రెస్ నేతలు సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని, తాను ఏ పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఇక ఇటీవల బండి సంజయ్ ను కేంద్ర మంత్రిగా చేసి, ఈటల రాజేందర్ కు బిజెపి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఆ ప్రచారానికి చెక్ పెడుతూ విజయశాంతి వచ్చే ఎన్నికలకు బండి సంజయ్ సారధ్యంలోనే వెళతామని స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు విషయంలో ఈటల రాజేందర్ పై జరుగుతున్న ప్రచారానికి విజయశాంతి వ్యాఖ్యలతో ఒక క్లారిటీ వచ్చింది. ఇక విజయశాంతితో వ్యాఖ్యలు చేయించింది కూడా పార్టీలోని కొందరు నేతలే అని చర్చ జరుగుతుంది. ఇలా ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసి రకరకాల వ్యవహారాలలో ఆయనను చేర్చి ఈటలను ఇబ్బంది పెడుతున్నారు. ఇక ఈటలకు ఎదురవుతున్న ఈ ఇబ్బందుల వెనుక బిజెపి అంతర్గత ఆధిపత్య పోరు కూడా కారణంగా రాష్ట్రంలో చర్చ జరుగుతుంది
One Comment