
నందమూరి తారకరత్న. సినీ హీరో. ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో క్రిటికల్ కండీషన్లో ఉన్నారు. ఆయన ప్రాణాలు నిలబెట్టేందుకు వైద్యులు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఎక్మోతో కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. బెలూన్ యాంజియోప్లాస్టీతో బ్లడ్ పంపింగ్ చేస్తున్నారు. ఆయన క్షేమంగా తిరిగిరావాలని కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుకుంటున్నారు.
తారకరత్న అనగానే వెంటనే గుర్తుకొచ్చేది “ఒకటో నెంబర్ కుర్రాడు”. తారకరత్న మొదటి సినిమా. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ అది. ఇప్పటికీ ఆ టైటిల్ చాలామందికి గుర్తే ఉంటుంది. అంత గ్రాండ్ ఎంట్రీ మరి. సినిమా మాత్రం ఫ్లాప్. ఆ తర్వాత పలు చిత్రాలు వచ్చినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. మధ్యలో ‘అమరావతి’ మూవీలో విలన్ గా చేసి మెప్పించారు. నంది అవార్డు కూడా సాధించారు. ఆ తర్వాత ‘మనసంతా’ సినిమా కూడా ఫర్వాలేదనిపించింది. లేటెస్ట్ గా ‘9 అవర్స్’ వెబ్ సిరీస్ లో కొత్త లుక్ లో కనిపించారు తారకరత్న. ఇలా ఆయన కెరీర్ ఒడిదొడుకులతోనే సాగిందని చెప్పాలి.
తారకరత్న గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. వింటు.. అవునా? అని ఆశ్చర్యపోతారు. చాలామందికి గుర్తే ఉంటుందనుకోండి. 20 ఏళ్ల వయసులో.. ఒకేసారి 9 సినిమాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడీ నందమూరి వారసుడు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఒకేసారి తొమ్మిది సినిమాలంటే మాటలా? అందుకే, అప్పట్లో అంతా అవాక్కయ్యారు. అది వరల్డ్ రికార్డ్ కూడా అన్నారు.
ఆ తొమ్మిది సినిమాల్లో మొదటిదే ఒకటో నెంబర్ కుర్రాడు. మిగతా 8 సినిమాల్లో చాలా వరకూ రిలీజ్ కాలేదు. కొన్నైతే షూటింగే మొదలవ్వలేదు. ఆ తొమ్మిదిలో ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు సినిమాలు వెండితెర మీదకు వచ్చాయి. అన్నీ ఫట్టే. ఒక్కటి కూడా హిట్ కాలే. తారకరత్న కెరీర్ లో హిట్ అనేదేలే. మొత్తం 21 సినిమాలు చేశారు. అమరావతి సినిమాలో విలన్ క్యారెక్టర్ కు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు వరించడం విశేషం.
చాలాకాలం క్రితమే సినిమాలు మానేసిన తారకరత్న.. ప్రజెంట్ పొలిటికల్ ఎంట్రీ ప్లానింగ్ లో ఉన్నారు. గన్నవరం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవలే లోకేశ్ ను కూడా కలిశారు. తాజాగా, లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవానికి వచ్చి.. తీవ్ర అస్వస్థతకు లోనై.. ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఇంతకీ తారకరత్న ఎవరంటే.. ఎన్టీఆర్ మూడో కుమారుడు.. నందమూరి మోహన కృష్ణ తనయుడే ఈ తారకరత్న