
తెలంగాణ బిజెపిలో చక్రం తిప్పాలని ప్రయత్నం చేస్తున్న ఈటల రాజేందర్ కు అడుగడుగునా అంతరాలు ఎదురవుతున్నాయా? పార్టీలో చేరికల పై ఫోకస్ పెట్టి, అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి కీలక నేతలను కమల తీర్థం పుచ్చుకునేలా చేయాలని భావించిన ఈటల రాజేందర్ ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోతున్నారా? ఈటల రాజేందర్ అనుకున్నది ఒకటైతే.. జరుగుతుంది ఇంకొకటా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.
ఈటల రాజేందర్ కు బాధ్యతలు అప్పగించి ఇంతకాలం అవుతున్నా కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నది లేదు. దీంతో ఈటల రాజేందర్ లోలోపల తెగ మదన పడుతున్నారని సమాచారం. అసలు ఈటల రాజేందర్ ప్రయత్నం చేయడం లేదా? అంటే ఆయన ప్రయత్నం చేస్తున్నప్పటికీ బీజేపీలో చేరుతున్న వారు లేరు. అందుకు ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కారణంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఈటల రాజేందర్ కెసిఆర్ కోవర్టులు అన్ని పార్టీలలోనూ ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బిజెపిలోకి కూడా చేరికలు జరగకపోవడం వెనుక కోవర్టులు ఉన్నారన్న అభిప్రాయాన్ని ఈటల రాజేందర్ వ్యక్తం చేశారు. అసలు ఇంతకీ బీజేపీలో ఉన్న కెసిఆర్ కోవర్టులు ఎవరు? పార్టీ అంతర్గత సమాచారాన్ని, కీలక అంశాలను, కెసిఆర్ కు ఎప్పటికప్పుడు అందజేస్తున్న వారు ఎవరు? అన్నది పార్టీ నేతల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.
ఈటల రాజేందర్ బిజెపిలో కొనసాగుతున్న కెసిఆర్ కోవర్టులను గుర్తించారా? లేక తనకు అధిష్టానం అప్పగించిన టాస్క్ సక్సెస్ చేయలేక ఈటల రాజేందర్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా? అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా బోలెడంత భరోసాతో పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంలో ఈటల రాజేందర్ ఇప్పటివరకు సక్సెస్ కాలేకపోయారు. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో.. సమయం లేదు మిత్రమా అని ఒకపక్క హెచ్చరిక జారీ అవుతున్నా.. పార్టీలో చేరికల విషయంలో ఎలాంటి క్లారిటీ రావడం లేదు. కీలక నేతలు ఎవరు బిజెపి పైన దృష్టి సారించడం లేదు .దీంతో ఈటల రాజేందర్ కి బిజెపిలోకి వచ్చిన తర్వాత పెద్ద కష్టమే వచ్చి పడింది. మరి ఈ కష్టం నుంచి ఆయన గట్టెక్కాలంటే, బిజెపి అగ్ర నేతల ముందు తెలంగాణ బిజెపిలో కీలక లీడర్ గా ఆయన గుర్తింపు పొందాలి అంటే బలమైన నేతలను బిజెపి బాట పట్టించాల్సిందే. మరి ఈ ప్రయత్నంలో ఈటెల రాజేందర్ సక్సెస్ అవుతారా?
2 Comments