
కాంగ్రెస్ లో కుమ్ములాటలు కామనే. ఒకరు ఒకటంటారు.. ఇంకొకరు ఇంకోటంటారు. పరస్పరం అనుకుంటూనే ఉంటారు. పార్టీ ఏమైపోయినా పర్వాలేదు కొందరికి. ఈ కేటగిరిలో సీనియర్లు సైతం ఉండటం కాంగ్రెస్ దురదృష్టం.శుక్రవారం గాంధీభవన్ లో కీలక పరిణామం జరిగింది. కొంతకాలంగా నిప్పు-ఉప్పుగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. కలిసిమెలిసి మంచిచెడు మాట్లాడుకున్నారు. పార్టీ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత కోమటిరెడ్డి.. కాంగ్రెస్ ఇంఛార్జ్ థాక్రేను కలిసి పలు సూచనలు చేశారు. అంతా కలిసి పని చేద్దామని పిలుపు ఇచ్చారు.
హమ్మయ్యా.. కాంగ్రెస్ లో పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని అంతా అనుకున్నారు. అంతలోనే మరో వివాదం. అంతాసాఫీగా ఉంటే అది కాంగ్రెస్ ఎందుకు అవుతుందనేలా సీనియర్ లీడర్ కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్లు చేశారు.గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అంతా ఎజెండా ప్రకారం మాట్లాడుతున్నారు. కొండా సురేఖ మాత్రం ఉన్నట్టుండి కోమటిరెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని.. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.అంతా షాక్. అది విని అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. ఇదేంటి ఒకరోజు ముందేకదా కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిల భేటీ జరిగింది. థాక్రేనూ కలిశారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో కొండా సురేఖ మళ్లీ ఇలా కోమటిరెడ్డిని సస్పెండ్ చేయాలంటూ వ్యాఖ్యలు చేయడం తేనెతెట్టును కదపడమే అని ఉలిక్కిపడ్డారు.వెంటనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. వ్యక్తిగతంగా మాట్లాడవద్దని.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ ఇంఛార్జ్ కి చెప్పుకోవచ్చని కొండాను కట్టడి చేశారు. ఎజెండా మేరకే మాట్లాడాలని గట్టిగా చెప్పారు. అక్కడితో అంతా కామ్.
మరి, కొండా సురేఖ లాంటి సీనియర్ ఊరికే కోమటిరెడ్డిని కార్నర్ చేస్తారా? ఆమె ఆగ్రహం వెనుక కారణం ఉందని అంటున్నారు. అందుకు, జనగామ డీసీసీ ప్రెసిడెంట్ ఇష్యూనే రీజన్ అని చెబుతున్నారు. కాంగ్రెస్ ఇంఛార్జ్ థాక్రేను కలిసిన కోమటిరెడ్డి.. జనగామ డీసీసీని కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఇవ్వాలని కోరారు. ఆయనకు ఈయన బలమైన మద్దతు పలికారంటూ వార్తలు వచ్చాయి. అయితే, జనగామ కాంగ్రెస్ పీఠంపై తన మనిషి అయిన జంగా రాఘవరెడ్డిని కూర్చోబెట్టాలని కొండా సురేఖ దంపతులు పట్టుబడుతున్నారు. తమను కాదని కోమటిరెడ్డి.. కొమ్మూరి ప్రతాపరెడ్డి కోసం లాబీయింగ్ చేస్తుండటమే ఆమె ఆగ్రహం వెనుక ఉన్న వ్యూహం అంటున్నారు. తన మనిషికి అడ్డుతగులుతున్నారనే భావనతోనే.. ఏకంగా వెంకట్ రెడ్డికే చెక్ పెట్టేలా.. వ్యూహాత్మకంగా ఈ సమావేశంలో కోమటిరెడ్డిని సస్పెండ్ చేయాలనే వాదన తీసుకొచ్చారని తెలుస్తోంది. కాంగ్రెస్ లో అంతే. ఇదంతా కామన్.
2 Comments