
తెలంగాణ కాంగ్రెస్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకున్నారు. గాంధీ భవన్ ఇందుకు వేదిక అయింది. ఇద్దరి మధ్య కొంత కాలంగా సాగుతున్న కాంగ్రెస్ మార్క్ రాజకీయం నడుమ ఈ ఇద్దరి సడన్ కలయిక పార్టీలో ఆసక్తిగా మారింది. పార్టీ రాష్ట్ర కొత్త ఇంఛార్జ్ థాక్రే గాంధీ భవన్ కు వచ్చారు. థాక్రే ఆహ్వానం తో గాంధీ భవన్ కు కోమటిరెడ్డి వచ్చారు. రేవంత్ తో కలిసి భేటీ అయ్యారు.ఇద్దరు నేతలు హాత్ సే హాత్ జోడో అంటూ.. కలిపారు. పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా పని చేస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు. ఈ పరిణామం రేవంత్ తో విభేదిస్తున్న సీనియర్లకు షాక్ గా మారింది.
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతల చేపట్టిన సమయం నుంచి కోమటిరెడ్డి వ్యతిరేకంగా ఉన్నారు. పలు సందర్భాల్లో రేవంత్ పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఈ ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగింది. మునుగోడు ప్రచారానికి వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. రాహుల్ జోడో యాత్ర హైదరాబాద్ చేరుకున్నా…కోమటిరెడ్డి హాజరు కాలేదు. కాంగ్రెస్ కు సహకరించాలంటూ ఫోన్..రాజగోపాల్ రెడ్డి గెలుస్తారంటూ ఆస్ట్రేలియాలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కాంగ్రస్ నాయకత్వం వెంకటరెడ్డికి నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కు మాణిక్కం ఠాకూర్ స్థానంలో కొత్తగా మాణిక్ రావు ఠాకూర్ వచ్చారు. తొలి సారి హైదరాబాద్ కు వచ్చిన సమయంలో గాంధీ భవన్ కు తాను రాలేనంటూ ఎమ్మెల్వే క్వార్టర్స్ లో కొత్త ఇంఛార్జ్ తో భేటీ అయ్యారు.
ఆ సమయంలోనే తనకు ఇచ్చిన నోటీసులు చెత్త బుట్టలోకి వెళ్లాయని వ్యాఖ్యానించారు. రేవంత్ పైన పలు సందర్భాల్లో కోమటిరెడ్డి వైఖరి పార్టీలో వివాదాస్పదంగా మారాయి. పార్టీ సీనియర్లు కూడా రేవంత్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రధానితో భేటీ తరువాత అసలు కోమటిరెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా.. బయటకు వెళ్తారా అనే చర్చ సాగింది. ఇప్పుడు కొత్త ఇంఛార్జ్ గాంధీ భవన్ కు వచ్చిన సమయంలో సడన్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ ప్రత్యక్షం అయ్యారు. కొత్త ఇంఛార్జ్ ఆహ్వానంతోనే తాను వచ్చానని చెప్పుకొచ్చారు. ఈ నెల 26వ తేదీ నుంచి హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో స్టార్ క్యాంపెయినర్ గా పాల్గొంటానని ప్రకటించారు. తాను ఎప్పుడూ గాంధీ భవన్ కు రానని చెప్పలేదన్నారు.
4 Comments