
తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. కర్ణాటకతో పాటు తెలంగాణ ఎన్నికలు జరగడం ఖాయమని బీజేపీ, కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను గ్రాండ్ గా నిర్వహించారు కేసీఆర్, ఈ నేపథ్యంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, కేసీఆర్ వ్యూహాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టింది బీజేపీ కోసమేనన్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకే బీఆర్ఎస్ తో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుండా కేసీఆర్ కుట్రలు మొదలు పెట్టారని ఆరోపించారు.
కర్నాటకలో 25 మంది కాంగ్రెస్ నేతలతో కేసీఆర్ బేరసారాలు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వాళ్లకు 500 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారని చెప్పారు. తక్కువ మార్జిన్‌తో గెలిచే నేతలను టార్గెట్ పెట్టుకుని కేసీఆర్ ఈ ఆపరేషన్ చేశారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. సదరు నేతకు చీవాట్లు పెట్టిందని తెలిపారు. సునీల్ కనుగోలు రిపోర్టును దొంగిలించి కేసీఆర్ ఈ పనిచేశారని మండిపడ్డారు. సునీల్ కనుగోలు ఆఫీసుపై దాడి వెనుక చాలా కారణాలున్నాయన్నారు రేవంత్ రెడ్డి. ఈ విషయం కుమారస్వామికి కూడా తెలీదని అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ మీటింగ్‌కు కుమారస్వామి రాకపోవడానికి అదే కారణం అని అన్నారు.
కర్నాటకలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సర్వేలు అన్ని చెబుతున్నాయని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్‌కు 125 నుంచి 130 సీట్ల వరకు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ అధికారం చేపట్టకుండా.. 100 లోపే సీట్లు వచ్చేలా కేసీఆర్ కుట్రలు మొదలు పెట్టారని ఆరోపించారు. అలాగే, సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని ఫిబ్రవరి చివరి వారంలో రద్దు చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.ఢిల్లీ మద్యం స్కామ్‌లో బీఆర్ఎస్, ఆప్ నేతలు భాగస్వాములని.. అందుకే ఒకే వేదికపై కనిపించారని విమర్శించారు. దేశాన్ని బీజేపీ చెర నుంచి విడిపించి అభివృద్ధి పథంలో నడిపిస్తానన్న కేసీఆర్.. గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఏళ్ల తరబడి మోదీతో కేసీఆర్ అంటకాగారని విమర్శించారు.
One Comment