
తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ అంతకంటే ముందే ఎన్నికలు జరగవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ముందుస్తు ఎన్నికలకు వెళ్లినట్లుగానే సీఎం కేసీఆర్ ఈసారి కూడా ముందుస్తుకు వెళ్లవచ్చనే ప్రచారం జరుగుతోంది. తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 6 నెలల్లో ఎప్పుడైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావచ్చని అన్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో బండి సంజయ్ వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. మరో 6 నెలల్లో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని. కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని బండి సంజయ్ సూచించారు.
పోలింగ్ బూత్ కమిటీ ద్వారానే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముందని బండి సంజయ్ అన్నారు. బీజేపీకి పోలింగ్ బూత్ స్థాయి కమిటీలే మూల స్తంభమని.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా పనిచేశారని చెప్పుకొచ్చారు. పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనంతో బీజేపీ బలమేంటో అర్ధమైందని బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా సరల్ యాప్‌ను ఆయన లాంచ్ చేశారు. అందులో కేంద్ర ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలు, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను పొందుపర్చుతున్నామని చెప్పారు. వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బండి సంజయ్.
తెలంగాణలో సీఎం కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం కలిసివచ్చే అన్ని అస్త్రాలను సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని కేంద్ర నాయకత్వం యోచిస్తోన్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ రాజకీయ వ్యూహాలన్నీ తెలిసిన ఈటెల రాజేందర్ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగడతాడని కేంద్ర బీజేపీ పెద్దలు యోచిస్తున్నారని సమాచారం. కేసీఆర్, కేటీఆర్ కు ధీటైన సమాధానం చెప్పాలంటే తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈటెలకు అప్పగించడం తప్పదని తెలుస్తోంది.
6 Comments