
హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. జీతాలు పెంచాలంటూ అమీర్‌పేట దగ్గర ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. 27 స్టేషన్ల రెడ్‌లైన్ టికెటింగ్ సిబ్బంది..విధులను బహిష్కరించారు. గత ఐదేళ్లుగా జీతాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వేతనాలు పెంచాలన్నారు.
ఉద్యోగుల ధర్నాతో మియాపూర్-ఎల్బీనగర్ రూట్‌లో గందరగోళం నెలకొంది. టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూకట్టారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రెడ్‌లైన్ టికెటింగ్ సిబ్బంది ఆందోళనపై హైదరాబాద్ మెట్రో యాజమాన్యం స్పందించింది. ధర్నాలో పాల్గొన్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. పనికి తగినట్లు వేతనాలు ఇస్తున్నామని స్పష్టం చేసింది.
తొలగిస్తామని యాజమాన్యం ప్రకటన చేసినా.. ఉద్యోగుల వెనక్కి తగ్గలేదు. వేతనాలు పెంచాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈక్రమంలోనే ఇరువర్గాల మధ్య చర్చలు జరిగాయి. 10 మంది సిబ్బందితో మెట్రో అధికారులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఐతే చర్చలు ఫలించలేదని సమాచారం అందుతోంది
2 Comments