
తెలంగాణ కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్ తగలనుందని తెలుస్తోంది. కొన్ని రోజులుగా పార్టీలో అసమ్మతి రాగం వినిపిస్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేపు ప్రధాని నరేంద్ర మోడీని కలవబోతున్నారు. కోమటిరెడ్డి ప్రధాని అపాయింట్ మెంట్ కోరగా.. రేపు మధ్యాహ్నం సమయం ఇస్తూ పీఎంవో నుంచి సమాచారం వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ వెంకట్ రెడ్డి.. ప్రధాని మోడీని కలవనుండటం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసి అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చారు. ఉప ఎన్నికలో తమ్ముడికి మద్దతుగా వెంకట్ రెడ్డి ప్రచారం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ప్రకటించిన పీసీసీ నూతన కమిటీల్లో ఎంపీ వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు. పీసీసీ కమిటీలపై స్పందించిన కోమటిరెడ్డి.. ఇప్పటికైతే తన మెడపై కాంగ్రెస్ కండువా ఉందని.. భవిష్యత్ లో ఏం జరగబోతుందో చెప్పలేమని కామెంట్ చేశారు. తాజాగా ప్రధాని మోడీని వెంకట్ రెడ్డి కలవనుండటం ఆసక్తిగా మారింది.
తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లాక అతడిని ఉప ఎన్నికల్లో గెలిపించడానికి అన్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయని ప్రయత్నం లేదు. కానీ అన్న ప్రయత్నాలు ఫలించలేదు. తమ్ముడు మునుగోడులో గెలవలేదు. అయితే కాంగ్రెస్ ఎంపీ చిక్కుల్లో పడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినందుకు గాను కాంగ్రెస్ నోటీసులు ఇచ్చింది. రేపో మాపో సాగనంపేందుకు సన్నాహాలు చేస్తోంది.తన రాజకీయ భవిష్యత్ కోసం అన్న వెంటకరెడ్డి సైతం బీజేపీ బాటపడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలో ప్రధాని మోడీతో వెంకటరెడ్డి భేటి కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల రాహుల్ గాంధీ పాదయాత్రకు కూడా హాజరుకాని వెంకటరెడ్డి ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దను కలవడంతో ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
రెండు రోజులుగా మోడీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్న వెంకటరెడ్డికి రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఖరారైంది. నల్గొండ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల కోసమే కలుస్తానని పైకి అన్నా కూడా ఎవరూ నమ్మడం లేదు.మూసీనది ఎంఎంటీఎస్ విస్తరణపై వినతిపత్రాలు ఇష్తారని అంటున్నా కూడా అందరికీ మోడీతో భేటిపై డౌట్ కొడుతోంది.తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి మధ్య వైరం నడుస్తోంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడడం లేదు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి వెంకటరెడ్డి వ్యతిరేకిస్తున్నారు.
ఇటీవలే ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతో నిన్ననే భేటి అయ్యి ఫిర్యాదు చేసినా ఆయన పెద్దగా స్పందించలేదు. పార్టీ నుంచి సీనియర్లు వెళ్లిపోవడం.. పార్టీలో కొనసాగుతున్న నైరాశ్యం వివరించినా ఆయన పెద్దగా స్పందించలేదని సమాచారం.దీంతో మూడు దశాబ్ధాలుగా కాంగ్రెస్ లో ఉన్న వెంకటరెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో నల్గొండ జిల్లా నుంచే పోటీచేస్తానని ప్రకటించిన వెంకటరెడ్డి ఏ పార్టీ నుంచి అన్నది చెప్పలేదు. సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడంతో వెంకటరెడ్డి కూడా వెళ్లబోతున్నాని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఎన్నికల సమయానికి బీజేపీలో చేరుతాడని టాక్ నడుస్తోంది.
One Comment