
గుజరాత్ లో కమలం దంచేసింది. వరుసగా ఏడవసారి అధికారం సాధించింది. గత రికార్డులన్నీ తిరగరాస్తూ మరోసారి గుజరాత్‌లో బంపర్ మెజార్టీ సాధించింది కమలదళం. మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమైనా మోదీ మేనియా ముందు తేలిపోయారు. మునుపటికంటే ఓట్లు, సీట్లు పెరగడంతోపాటు బీజేపీ జోరు అమాంతం పెరిగిపోయింది. దేశ వ్యాప్తంగానూ బీజేపీ శ్రేణుల్లో గుజరాత్ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇదే రకమైన ఫలితాలను రిపీట్ చేస్తామని చెబుతున్నారు. అటు తెలంగాణ బీజేపీ శ్రేణులు కూడా ఈ ఫలితాల పట్ల హర్షం వ్యక్తంచేస్తున్నారు. 2023లో తెలంగాణలో అధికారం మాదేనంటూ ధీమా వ్యక్తంచేస్తున్నారు.
గుజరాత్‌లోఈసారి బీజేపీ,కాంగ్రెస్,ఆప్ మధ్య హోరాహోరి పోటీ నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఢిల్లీ, పంజాబ్‌ను ఊడ్చేసి ఊపుమీదున్న ఆప్, ఈ సారి గుజరాత్ బరిలో దిగి గట్టి పోటీ ఇవ్వనుందనే ఊహాగానాలు వినిపించాయి. ఐతే మోదీ-షా ద్వయం మొదటి నుంచే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఏయే నియోజకవర్గాల్లో సమస్యలున్నాయో గుర్తించి వాటిని పరిష్కరిస్తూ ముందుకెళ్లారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉన్నచోట గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 38 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారంటే, బీజేపీ సాహసమైన నిర్ణయమే తీసుకుంది. ఎక్కడా వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడింది. పటేల్లా మద్దతు కూడగట్టడంలో పైచేయి సాధించారు. ముందుగానే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భూపేంద్ర పటేల్‌ను ప్రకటించారు.ప్రధాని మోదీ రోడ్‌షో బీజేపీకి బాగా కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా.
గుజరాత్ రిజల్ట్స్ బీజేపీలో సరికొత్త జోష్ నింపాయి. ఇవి జస్ట్ ట్రయల్స్ మాత్రమే.. 2024లోనూ ఇదే రిపీట్ అవుతుందని బల్లగుద్ది చెబుతున్నారు.! తెలంగాణలోనూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై తప్పనిసరిగా ఉంటుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే గుజరాతీ ప్రజలు భారీ మెజార్టీతో బీజేపీని గెలిపించారని చెప్పారు. గుజరాత్ ఫలితాలను తెలంగాణలోనూ రిపీట్ చేస్తామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. రాజకీయంగా తమకు అత్యంత కీలకమైన గుజరాత్‌లో ఎన్నికలు ముగియడంతో ఇక బీజేపీ అధిష్టాన పెద్దలు తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెడుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలను సిద్ధం చేయడంలో బీజేపీ అగ్రనేతలు ఇక తలమునకలు కానున్నాయి.