
ఉమ్మడి ఏపీ విభజనపై 8 ఏళ్లు గడిచాక కూడా నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా నేతల మధ్య మాటలు, కౌంటర్లు కాక రేపుతున్నాయి. విభజన కేసుపై ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన రచ్చ.. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్‌తో దుమారానికి కారణమైంది. తెలంగాణ, ఏపీ కలవాడానికి ఏ వేదిక దొరికినా.. తమ పార్టీ, ప్రభుత్వం తమ ఓటేస్తుందని చెప్పటం ఇప్పుడు చర్చకు దారి తీసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మళ్లీ కలవాలన్నదే తమ విధానం అంటూ.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఆరోపణలపై కౌంటర్ ఇచ్చే సందర్భంగా సజ్జల రామకృష్టారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు అవి చర్చనీయాంశంగా మారాయి.
కుదిరితే మళ్లీ ఎపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ పార్టీ విధానమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. విభజన తీరు అసంబద్దం అని సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాము తొలి నుంచీ పోరాడుతున్నామన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ పోరాటం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే తొలుత స్వాగతించేది తమ పార్టీనే అన్నారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ వాదనలు బలంగా వినిపిస్తామని కూడా తెలిపారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి.. లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలసి ఉండాలన్నదే ఇప్పటికీ తమ విధానమని ఉద్ఘాటించారు. రెండు రాష్ట్రాలు కలసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముందన్నారు.
వైసీపీ కీలక నేత సజ్జల స్టేట్‌మెంట్లపై తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. సజ్జల చేసిన వ్యాఖ్యలను సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. మళ్లీ తెలంగాణపై కుట్ర జరుగుతోందని పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్ర ఏర్పడి సుమారు 10 ఏళ్లవుతోందని గుర్తించిన పొన్నం ప్రభాకర్.. ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రాలు ఏర్పడ్డాయని తెలిపారు. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా విడిపోయి.. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో.. మళ్లీ తెలంగాణపై దాడి జరిగే కుట్ర జరుగుతోందని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాత్రం కొంత సున్నితంగానే స్పందించారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కలిసుండాలనే కోరుకుందని భట్టి గుర్తు చేశారు. ఇప్పటికీ కూడా వాళ్లు అదే చెప్పి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని బలంగా కోరుకోవటం వల్లే ప్రత్యేక చట్టం తీసుకొచ్చి విభజన చేయాల్సి వచ్చిందని వివరించారు.