
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ఆయన రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటు బీబీనగర్ ఎయిమ్స్‌ను ఆయన ప్రారంభించనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వరుసగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను మంజూరు చేస్తోంది. ఇప్పటికే ఐదు రైళ్లు ప్రారంభమవగా.. ఆరో రైలు తెలంగాణకు రానుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వేకు మంజూరుచేసినట్లు ఇక్కడి అధికారులకు సమాచారం అందింది. సికింద్రాబాద్-విజయవాడ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నారు. త్వరలోనే తేదీని ఖరారు చేస్తారు. ఈ రైలును ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి సమయం కేటాయించాలని ప్రధాని మోడీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
మరోవైపు బీబీనగర్ ఎయిమ్స్ కొత్త భవనాలకు ప్రధాని నరేంద్ర మోడీతో శంకుస్థాపన చేయించాలని తెలంగాణ బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ రెండు కార్యక్రమాలకు ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశముందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు సార్లు తెలంగాణలో పర్యటించారు. ఫిబ్రవరి సమతా విగ్రహావిష్కరణ, మేలో ఐఎస్‌బీ వార్షికోత్సవం, జులైలో బీజేపీ జాతీయ కార్యకవర్గ సమావేశాలు, నవంబరులో రామగుండ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం కోసం ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ప్రధాని మోడీ నాలుగు సార్లు తెలంగాణలో పర్యటించినా.. సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా ఆయన్ను కలవలేదు. స్వాగతం పలికేందుకు ఎయిర్‌పోర్టుకు కూడా వెళ్లలేదు.
ప్రస్తుతం సీబీఐ, ఈడీ దాడులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ మరింతగా పెరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితపై సీబీఐ నోటీసులు ఇచ్చింది. అటు ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
One Comment