
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హైకమాండ్ షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కు త్వరలోనే కొత్త బాస్ రానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట ఇంచార్జ్ గా ఉన్న మాణిక్యం ఠాకూర్ ను మార్చేసి.. మరో నేతను నియమించనున్నారని సమాచారం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఠాగూర్ మద్దతుగా ఉండటమే తాజా మార్పునకు కారణమని చెబుతున్నారు.
ఏఐసీసీ చీఫ్ గా కొత్తగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు. రాష్ట్ర నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు మునుగోడు ఉపఎన్నికను సాకుగా చూపి రేవంత్ రెడ్డి పీసీసీ పదవికి ఎసరు పెట్టే ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది.
మునుగోడు బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు. ఇందుకు రేవంత్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ సీనియర్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి రేవంత్ రెడ్డికి నష్టం చేస్తున్నారని.. మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న నేతలను కాకుండా తనతో పాటు వచ్చిన లీడర్లను ప్రోత్సహిస్తున్నారని సీనియర్లు హైకమాండ్ కు కంప్లయింట్ చేశారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, దాసోజు శ్రవణ్ వంటి కీలక నేతలు పార్టీ వీడారని ఖర్గేకు ఫిర్యాదు చేశారని అంటున్నారు. రేవంత్ వల్ల మరికొందరు నేతలు పార్టీ మారే అవకాశం ఉందని రిపోర్ట్ ఇచ్చారట. మాణిక్యం ఠాకూర్ మద్దతు వల్లే రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వెళుతున్నారని ఖర్గేకు సీనియర్ నేతలు నివేది ఇచ్చారని తెలుస్తోంది.
మాణిక్కం ఠాకూర్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అండగా ఉన్నారు. ఠాగూర్ తీరుపై కొందరు నేతలు మొదటి నుంచి గుర్రుగానే ఉన్నారు. ఠాకూర్ వల్లే రేవంత్ కు పీసీసీ పదవి వచ్చిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే కామెంట్ చేశారు. 30 కోట్లకు పీసీసీ పదవిని ఠాకూర్ అమ్ముకున్నారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి కూడా మాణిక్కం ఠాకూర్ పై విమర్శలు చేశారు. ఠాగూర్, రేవంత్ కలిసి పార్టీని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ఠాకూర్ పై మరికొందరు సీనియర్ నేతలు కూడా ఖర్గేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఠాకూర్ ను మార్చాలని హైకమాండ్ నిర్ణయించిందని సమాచారం. హైకమాండ్ నిర్ణయంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టేనని చెబుతున్నారు. త్వరలోనే ఏర్పాటు కానున్న పీసీసీ కొత్త కమిటీలో కూడా రేవంత్ రెడ్డికి షాక్ తగలనుందని చెబుతున్నారు.
One Comment