
క్రైమ్ మిర్రర్ కథనం మరోసారి నిజమైంది. క్రైమ్ మిర్రర్ చెప్పినట్లే చండూరు రెవిన్యూ డివిజన్ గా మారబోతోంది. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నిక ముందు తమ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల లోపే అన్ని హామీలను పూర్తి చేస్తామని చెప్పారు. నల్లగొండలో 12 స్థానాలను గెలిచిన చరిత్ర ఏ పార్టీకి లేదని.. గతంలో ఎన్నడూ లేనంతగా ఉమ్మడి జిల్లా ప్రజలకు టీఆర్ఎస్‌కు పట్టం కట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడును గెలిపిస్తే నియోజకవర్గాన్ని గుండెళ్లో పెట్టుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ప్రజలు ఇంతలా ఆశీర్వదించినందుకే కేసీఆర్ ఆదేశానుసారం ఇక్కడకి వచ్చామని చెప్పారు.
తిరుమల స్థాయిలో యాదాద్రికి భక్తులు తరలివస్తున్నారని. దండు మల్కాపురంలో 540 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ స్థాపించి పారిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రూ.402 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతామని.. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, మౌలిక వసతుల కల్పన కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.మునుగోడులో త్వరలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని వెల్లడించారు. చండూరు మున్సిపాలిటికీ రూ.50కోట్లు, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.30కోట్లు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో కొత్త 5 సబ్ స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. చండూరును త్వరలో రెవెన్యూ డివిజన్‌గా మారుస్తామన్నారు.సంస్ధాన్ నారాయణ పూర్ లో గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటుతోపాటు,రూ.కోటి తో సేవాలాల్ భవన్ నిర్మాణానికి హమి ఇచ్చారు కేటీఆర్
ఉప ఎన్నిక ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలు తీరుపై చర్చించేందుకు ఐదుగురు రాష్ట్ర మంత్రులు ఇవాళ మునుగోడు నియోజకవర్గానికి వెళ్లారు. మంత్రుల వెంట ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని పేర్కొన్నారు. నాలుగు శాఖల ఆధ్వర్యంలోనే రూ. 1544 కోట్లతో ఈ పనులు చేయనున్నామన్నారు. మిగిలిన శాఖల ఆధ్వర్యంలో కూడా పనులు ప్రారంభించనున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికను వల్ల ఈ ప్రాంత ప్రజల సమస్యలను అధ్యయనం చేసే అవకాశం తమకు దక్కిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తాము ఇచ్చిన హామీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు.
3 Comments