
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలను తమకు అస్త్రంగా మలుచుకున్నారు సీఎం కేసీఆర్. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన రూట్ మారింది. తన రాజీనామాతో జరిగిన మెదక్ లోక్ సభ ఉపఎన్నికలో ఆయన ప్రచారం చేయలేదు. కడియం శ్రీహరి రాజీనామాతో జరిగిన వరంగల్ ఉపఎన్నికను పెద్దగా పట్టించుకోలేదు. 2018 తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కొన్నింటిని సీరియస్ గా తీసుకోలేదు. దుబ్బాకలో ప్రచారం చేయలేదు. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, హుజురాబాద్ లో ఒక్కో బహిరంగ సభతో సరిపెట్టారు.
మునుగోడు ఉపసమరంలో మాత్రం కేసీఆర్ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన కొన్ని రోజులకే మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించారు సీఎం కేసీఆర్. మరిన్ని సభలు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు సభలు పెట్టడమే కాదు మిగితా నేతల మాదిరిగానే తానొక గ్రామానికి ఇంచార్జుగా ఉన్నారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
Read More : మునుగోడు మూడు పార్టీలకూ సవాలే… సిట్టింగ్ సీటు నిలబెట్టుకుంటేనే కాంగ్రెస్‌కు పుట్టగతులు
అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును శుక్రవారం ప్రకటించారు సీఎం కేసీఆర్. నామినేషన్లు మొదలు కావడం, అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రధాన పార్టీలన్ని తమ బలగాలను మునుగోడులో మోహరించాయి. మునుగోడు బైపోల్ ను సవాల్ గా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ.. ప్రజాప్రతినిధులందరికి ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించింది. మునుగోడు ఉపసమరంలో టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జుల ఎంపికలో సంచలన పరిణామం జరిగింది.
సీఎం కేసీఆర్ కూడా ఒక గ్రామానికి ఇంచార్జ్ గా ఉండటం హాట్ హాట్ గా మారింది. మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామానికి కేసీఆర్ ఇంచార్జుగా ఉన్నారు. మునుగోడు బైపోల్ బాధ్యతలను మొదటి నుంచి చూస్తున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు లెంకలపల్లితో పాటు సరంపేట గ్రామాలను మొదట కేటాయించారు. తర్వాత తనకు ఒక గ్రామం కేటాయించాలని కేసీఆర్ సూచించడంతో.. లెంకలపల్లి గ్రామాన్ని ముఖ్యమంత్రికి కేటాయించారు.
రాష్ట్రంలోని మొత్తం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా మునుగోడులో ప్రచారం చేయబోతున్నారు. మంత్రులకు కూడా గ్రామాలనే అప్పగించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కూడా రెండు వేల ఓట్లకు ఇంచార్జుగా ఉన్నారు. గట్టుప్పల్ లో రెండు ఎంపీసీలు ఉండగా.. ఒక్క ఎంపీటీసీ పరిధిలోని ఓట్లకు మంత్రి కేటీఆర్ ఇంచార్జుగా ఉన్నారు.
ఇక ట్రబుల్ షూటర్ గా పేరుండి ఎన్నో ఉపఎన్నికలను ఒంటిచేత్తో గెలిపించిన హరీష్ రావు మర్రిగూడ గ్రామ ఇంచార్జుగా ఉన్నారు. మిగితా మంత్రులంతా కూడా ఏదో ఒక గ్రామానికి, మున్సిపాలిటీ అయితే రెండు వార్డులకు ఇంచార్జులుగా ఉన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని మొత్తం 86 క్లస్టర్లుగా విభజించి పార్టీ నేతలందరికి బాధ్యతలు అప్పగించారు. అయితే సీఎం కేసీఆర్ ఒక్క గ్రామానికి ఇంచార్జుగా ఉండటం.. కేటీఆర్, హరీష్ రావులు కొన్ని పోలింగ్ కేంద్రాలకే పరిమితం కావడం సంచలనంగా మారింది.
Read More : నెల రోజుల్లో నాలుగు పార్టీలు జంప్.. మునుగోడు లీడరా నీకు సెల్యూట్!
మునుగోడు ఉపఎన్నికను తామెంత సవాల్ గా తీసుకున్నామో చెప్పడానికే ముఖ్యమంత్రి కూడా ఒక గ్రామానికి ఇంచార్జుగా ఉన్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విపక్షాలు మాత్రం మరో వాదన చేస్తున్నాయి. మునుగోడులో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని తేలడంతోనే కేసీఆర్ తన బలగాలను మొత్తం మోహరించారని అంటున్నారు. అందరూ సీరియస్ వర్క్ చేయాలని చెప్పడానికే సీఎం స్థాయిని మరిచి చిన్న గ్రామానికి ఇంచార్జుగా ఉన్నారని చెబుతున్నారు. మొత్తంగా లెంకలపల్లి అనే గ్రామానికి కేసీఆర్ ఇంచార్జుగా ఉండటం నియోజకవర్గంలో పెద్ద చర్చగా మారింది. మరోవైపు కేసీఆర్ తమ గ్రామానికి వస్తే తమ వరాలు లభిస్తాయనే ఆశతో లెంకలపల్లి గ్రామస్తులు ఉన్నారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి …
- మునుగోడులో కమలానికి కదిలిపోతున్న యువత.
- కూసుకుంట్లకు టీఆర్ఎస్ టికెట్.. సంబరాల్లో కోమటిరెడ్డి క్యాంప్!
- మునుగోడు అధికార పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
- ఐదొందలు ఇస్తే పొట్టుపొట్టు తిట్టింది.. వెయ్యి తీసుకుని జై కొట్టింది!
- దేశ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ.. 80 కోట్లతో చార్టెడ్ ఫ్లైట్ కొననున్న కేసీఆర్