
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా టీం : తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మునుగోడు టీఆర్ఎస్ లో మొదటి నుంచి అసమ్మతి తీవ్రంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓపెన్ గానే కొందరు నేతలు తమ వాయిస్ వినిపించారు. రేపుమాపో బైపోల్ షెడ్యూల్ వస్తుదనే సమాచారంతో రెబెల్ నేతలు మరింత దూకుడు పెంచారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన దాదాపు 60 మంది నేతలు హైదరాబాద్ లో శనివారం రహస్యంగా సమావేశమయ్యారు. మర్రిగూడెం మండలానికి చెందిన సీనియర్ నేత మునగాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ పార్టీ తీరుపై చర్చించారు. ముఖ్యంగా మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టార్గెట్ గానే ఈ సమావేశంలో చర్చ జరిగిందని తెలుస్తోంది.
Read More : మునుగోడులో బీజేపీ జోరు.. మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం కేసీఆర్ క్లాస్
మునుగోడు నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పార్టీలో కీలకంగా ఉన్న నేతలను కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. కూసుకుంట్ల అనుచరులుగా ఉన్నవారినే మంత్రి గుర్తిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కూసుకుంట్లపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అతనిని వ్యతిరేకిస్తున్న నేతలతో మాట్సాడి సెట్ చేయాల్సిన మంత్రి జగదీశ్ రెడ్డి.. వాళ్లను మరింత ఇబ్బంది పెట్టేలా చూడటంపై అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగదీశ్ రెడ్డి తీరుతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని చెబుతున్నారు. ఈ విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లేందుకే తాము సమావేశం అయ్యామని మునగాల వెంకటేశ్వరరావు చెప్పారు.
హైదరాబాద్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అసమ్మతి నేతలు. దసరా తర్వాత అక్టోబర్ 7న మునుగోడు నియోజకవర్గంలోనే భారీ సభ పెట్టాలని నిర్ణయించారు. నియోజకవర్గంలోని అన్నిమండలాల నుంచి దాదాపు ఏడు వేల మంది ఈ సభకు వస్తారని చెబుతున్నారు. తాము పార్టీకి వ్యతరేకం కాదని.. పార్టీ మారే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని మునగాల వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. తాము సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరామని.. దసరా తర్వా త రమ్మని ప్రగతి భవన్ నుంచి పిలుపు వచ్చిందన్నారు. కేసీఆర్ తో జరగబోయే సమావేశానికి ముందు మునుగోడులో సభ పెడుతున్నామన్నారు. అక్కడ తీసుకున్న నిర్ణయాలను పార్టీ పెద్దలకు వివరిస్తామంటున్నారు మునగాల వెంకటేశ్వరరావు. పార్టీ బలోపేతం, మునుగోడు ఉప ఎన్నికలో గెలవడం కోసమే తమ ప్రయత్నమని తెలిపారు.
Read More : కారులో కలవరం… సొంత పార్టీ నేతలతోనే, రెండుగా చీలుతున్న వర్గాలు…!
హైదరాబాద్ లో జరిగిన అసమ్మతి నేతల సమావేశం టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. మునగాల వెంకటేశ్వరరావు జరిపిన సమావేశానికి ఎవరెవరు వెళ్లారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరా తీశారని తెలుస్తోంది. అక్టోబర్ 7న తలపెట్టిన సభను అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే మునగాల వెంకటేశ్వరరావు మాత్రం తాము వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. తమకు పార్టీకి నష్టం కల్గించే ఆలోచన లేదని.. పార్టీ మారడం కూడా ఉండదని తేల్చి చెబుతున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి తీరుతో ఉప ఎన్నికలో పార్టీ నష్ఠం జరుగుతుందనే విషయాన్ని పార్టీ పెద్దలకు వివరిస్తామంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురడమే తమ లక్ష్యమంటున్నారు మునగాల వెంకటేశ్వరరావు. మొత్తంగా హైదరాబాద్ లో రహస్యంగా టీఆర్ఎస్ అసమ్మతి నేతలు సమావేశం కావడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి …
- బీసీలకు తాయిలాలు కాదు … రాజ్యాధికారంలో వాటా కావాలి…
- నెల రోజుల్లో నాలుగు పార్టీలు జంప్.. మునుగోడు లీడరా నీకు సెల్యూట్!
- ఐదొందలు ఇస్తే పొట్టుపొట్టు తిట్టింది.. వెయ్యి తీసుకుని జై కొట్టింది!
- ఈడీ అరెస్ట్ భయంతో ఎంపీ సంతోష్ పరారయ్యారా? ప్రగతి భవన్ లో ఏం జరిగింది.. ?
- దేశ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ.. 80 కోట్లతో చార్టెడ్ ఫ్లైట్ కొననున్న కేసీఆర్
2 Comments