
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : గత ఎనిమిదేళ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏకచక్రాధిపత్యం వహిస్తున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఆహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఆయనపై మొదటి నుంచి ఉన్నాయి. విపక్ష నేతలను చిన్నచూపు చూస్తారని అంటుంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. మునుగోడు ఎన్నికలో అంతా తానే వ్యవహరిస్తున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. రెండు నెలలుగా అక్కడే మకాం వేశారు. తాజాగా ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.
భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఎరువుల గోదాంకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన జగదీశ్ రెడ్డి.. రాజకీయ ప్రసంగం చేశారు. బీజేపీ వ్యతిరేకంగా, టీఆర్ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో మంత్రి ప్రసంగాన్ని సింగిల్ విండో బీజేపీ డైరెక్టర్లు అడ్డుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. తన ప్రసంగానికి అడ్డువచ్చిన బీజేపీ నేతలపై ఆగ్రహంతో ఊగిపోయారు మంత్రి జగదీశ్ రెడ్డి. బీజేపీ నాయకులకు బట్టలిప్పి కొడతా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తినడం లేదారా? ఏం చదివార్రా మీరు? అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు మంత్రి జగదీశ్ రెడ్డి. తెలంగాణలో ఉండటం ఇష్టం లేకుంటే గుజరాత్ వెళ్లిపోవాలని హెచ్చరించారు.
Read More : షబ్బీర్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి… కోమటిరెడ్డి మరో సంచలనం
ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడటమే కాకుండా బట్టలిప్పి కొడతానంటూ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న మంత్రి చిల్లరగా మాట్లాడటం ఏంటని నిలదీశారు. మంత్రికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో వాళ్లను అక్కడి నుంచి లాక్కెళ్లాలంటూ పోలీసులకు సైగలు చేశారు జగదీశ్ రెడ్డి. మంత్రి ఆదేశాలతో నిరసనకు దిగిన బీజేపీ నేతలకు సభ నుంచి బయటికి తీసుకెళ్లారు పోలీసులు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.మంత్రి మాటలపై జనాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది.
Read More : మునుగోడులో బీసీల ఉమ్మడి అభ్యర్థి.. ప్రధాన పార్టీల్లో కలవరం?
మునుగోడులో ప్రచారం చేస్తున్న జగదీశ్ రెడ్డి తీరుపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎవరిని లెక్క చేయకుండా ఏకపక్షంగా ముందుకు వెళుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మునుగోడు టికెట్ ఆశించిన బీసీ నేతలను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జగదీశ్ రెడ్డి వైఖరి వల్లే కొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారనే టాక్ ఉంది. అయినా జగదీశ్ రెడ్డి తీరు మారకపోవడంతో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
4 Comments