
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. బాలానగర్ మండలం జిల్లెల గడ్డ తండా మీడియా సమావేశం నిర్వహించిన షర్మిల సంచలన కామెంట్లు చేశారు. తన తండ్రి వైఎస్సార్ ను హత్య చేశారని ఆరోపించారు షర్మిల. తన తండ్రిని కుట్ర చేసి చంపేశారు.. తనను కూడా అలానే చంపేస్తారేమో అంటూ మాట్లాడారు వైఎస్ షర్మిల. తనపై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై సీరియస్ గా స్పందించారు షర్మిల. తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. కేసీఆర్ కు ధమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని ఆమె సవాల్ చేశారు. ఈ సందర్భంగా తాను జైలుకు వెళ్లడానికి భయపడేది లేదంటూ బేడీలను చూపించారు షర్మిల.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా సభల్లో కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేశారు షర్మిల. అయితే తమ ప్రతిష్టకు భంగం కలిగేలా షర్మిల మాట్లాడుతున్నారంటూ కొందరు పాలమూరు ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేశారని చెప్పిన షర్మిల.. తనపై నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్లపై ఫిర్యాదు చేసినా వనపర్తి పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఏ క్షణమైన తన పాదయాత్రను అడ్డుకొని అరెస్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తాను బేడీలకు భయపడే బిడ్డను కాదని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కూడా కుట్ర పూర్వకంగానే చంపారని.. తనను కూడా అలాగే చంపాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు షర్మిల.