
తెలంగాణలో ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా పాలనకు చీఫ్ గా గౌరవమైన స్థానంలో ఉన్న అధికారులు పబ్లిక్ గానే చిల్లరగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సుర్యాపేటలో జరిగిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ బరి తెగించారు. సభ వేదికపైనే జయహో జగదీశన్న అంటూ నినాదాలు చేశారు. తాను చేయడమే కాదు సభకు వచ్చిన జనాలతోనూ మంత్రికి జై కొట్టించారు. జిల్లా ఎస్పీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ ఘటన మరవకముందే అలాంటే ఘటనే మరొకటి జరిగింది. ఈసారి జిల్లా కలెక్టర్ ఆ బాధ్యత తీసుకున్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్లో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించారు. వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ను అభినవ అంబేద్కర్గా కలెక్టర్ డా.శరత్ పొగిడారు. గిరిజనులకు 1౦ శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై కలెక్టర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పేద దళిత, గిరిజన వర్గాలకు కేసిఆర్ ఆశాదీపంగా మారారని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను చూడలేదని, కేసీఆర్ రూపంలో ఆయనను ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ అట్టడుగు వర్ణాల అభ్యున్నతికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. దేశ చరిత్రలో ఇది సంచలన నిర్ణయం అని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. భూమి లేని గిరిజనులకు “గిరిజన బంధు” అంటూ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారని శరత్ ప్రశంసించారు.