
తెలంగాణ కాంగ్రెస్ లో మరో సంచలన పరిణామం జరిగింది. ఎప్పుడు ఏదో ఒక ప్రకటన చేస్తూ వార్తల్లో ఉండే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. తన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కాక రేపుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. మునుగోడుపై పార్టీ పెద్దలు నిర్వహించిన సమావేశాలు కూడా దూరంగానే ఉన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సన్నాహాక సమావేశాలకు కూడా జగ్గారెడ్డి హాజరు కాలేదు.
కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్న జగ్గారెడ్డి తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. అయితే గతంలో లాగా ఆయన ఎవరిని టార్గెట్ చేయలేదు. తన రాజకీయ భవిష్యత్ కు సంబంధించి సంచలన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు జగ్గారెడ్డి. తన స్థానంలో సంగారెడ్డి కార్యకర్తలకే అవకాశంఇస్తానన్నారు. కేడర్ వద్దంటే తన భార్య నిర్మలను బరిలోకి దింపుతానని ప్రకటించారు జగ్గారెడ్డి. అయితే 2028 ఎన్నికల్లో మాత్రం తాను తిరిగి పోటీ చేస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనంటూ జగ్గారెడ్డి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలను షాకింగ్ కు గురి చేసింది. అయితే తన భార్య నిర్మలను సంగారెడ్డి నుంచి పోటీ చేయించేందుకే జగ్గారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వస్తోంది.
చాలా రోజులుగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు నిర్మలా జగ్గారెడ్డి. ఆమె మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేశారు. 2018 ఎన్నికల్లో తన భర్త తరపున నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. తన కూతురుతో కలిసి అంతా తానే చూసుకున్నారు. జగ్గారెడ్డి అరెస్టైన సమయంలోనూ పార్టీ నేతలకు అండగా నిలిచారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ నిర్మల పోటీ చేశారు.