
హైదరాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవంపై వివాదం కొనసాగుతోంది. ఎప్పటిలానే హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా.. హిందూ సంఘాలు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాత్రం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయడం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగుతున్నాయి. బీజేపీ నేతలు కూడా కేసీఆర్ సర్కార్, జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్నం పైకి చెబుతున్నది ఒకటి.. జరుగుతున్నది మరొకటని అంటున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ట్యాంక్ బండ్ కు వెళ్లారు పరిశీలించారు. వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులంతా సద్ది కట్టుకుని ట్యాంక్ బండ్ రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ట్యాంక్ బండ్ పైనే వినాయక నిమజ్జనం చేసి తీరుతామని ప్రకటించారు. ట్యాంక్ బండ్ పై హిందువులు ఇబ్బందులు పడుతుంటే దారుస్సలాంలో సంబురాలు చేసుకుంటున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. దారుస్సలాంను సంతృప్తి పర్చడానికి హిందువులను ఇబ్బంది పెడతారా? అని సంజయ్ ప్రశ్నించారు.
తాను నిఖార్సైన హిందువని చెప్పుకుంటున్న కేసీఆర్ కు కావాల్సింది ఇదేనా? అని సంజయ్ నిలదీశారు. భాగ్యనగర ఉత్సవ సమితి దీక్షలకు దిగొచ్చి ట్యాంక్ బండ్ పై హడావుడిగా క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. అయినా ఇప్పటికీ తూతూ మంత్రంగానే నిమజ్జన ఏర్పాట్లు ఉన్నాయన్నారు. మంత్రుల అబద్దాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. తెలంగాణ మున్సిపల్ మంత్రి నాస్తికుడు అన్నారు బండి సంజయ్. కేసీఆర్ హిందుత్వ బండారాన్ని ప్రపంచానికి చాటి చెబుదామంటూ ఆయన పిలుపిచ్చారు.