
టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున రాజకీయ రంగప్రవేశానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన లోక్ సభకు పోటీ చేయనున్నారని తెలుస్తోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బరిలో ఉండటం దాదాపుగా ఖాయమైందని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ పార్టీ పెద్దల అంతర్గత సమావేశంలో ఇదే విషయం చర్చకు వచ్చినట్టుగా సమాచారం.సోషల్ మీడియాలో సైతం ఇదే వార్త విస్తృతంగా ప్రచారమౌతోంది. వైఎస్ జగన్‌తో నాగార్జునకు చాలాకాలం నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. వైఎస్ జగన్ జైళ్లో ఉన్నప్పుడు సైతం నాగార్జున జగన్‌ను కలిశారు.
ఏపీలో కీలకమైన విజయవాడ స్థానం కోసం వైసీపీ కొత్త వ్యూహం పన్నింది.విజయవాడలో టీడీపీ చెక్ పెట్టాలంటే ఎంపీ స్థానాన్ని తప్పకుండా గెలవాలనేది వైసీపీ ఆలోచన. అందుకే టాలీవుడ్ హీరో నాగార్జున పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.2019 ఎన్నికల్లో ఏపీలో 151 సీట్లతో 2019లో అధికారాన్నిచేజిక్కించుకున్నా..కీలకమైన విజయవాడ ఎంపీ స్థానాన్ని మాత్రం వైసీపీ కోల్పోయింది. 2019లోనే కాదు..2014లో కూడా విజయవాడ ఎంపీగా టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని గెలిచారు. 2019లో వైసీపీ విజయవాడ అభ్యర్ధిగా పోటీ చేసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. విజయవాడ లోక్‌సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఆరింట వైసీపీ విజయం సాధించినా..పార్లమెంట్ స్థానం మాత్రం టీడీపీకే వెళ్లింది. అంటే పెద్ద ఎత్తన క్రాస్ ఓటింగ్ జరిగింది.
గతంలో రెండుసార్లు మిస్సయిన విజయవాడ స్థానాన్ని ఈసారి అంటే 2024 ఎన్నికల్లో ఎలాగైనా చేజిక్కించుకోవాలని వైసీపీ ఇప్పట్నించే సన్నాహాలు చేస్తోంది. సరైన అభ్యర్ధిని రంగంలో దింపడమే కాకుండా..క్రాస్ ఓటింగ్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.ఇందులో భాగంగానే నాగార్జున పోటీ చేయించాలని దాదాపుగా నిర్ణయించిందని తెలుస్తోంది.