
తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక బీజేపీలో టెన్షన్ పుట్టిస్తుందా అంటే అవుననే తెలుస్తోంది. నిజానికి కొన్ని రోజులుగా నియోజకవర్గంలో బీజేపీ యమ దూకుడు మీదుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక తర్వాత బీజేపీకి బూస్ట్ వచ్చింది. మునుగోడులో జరిగిన అమిత్ షా సభ సూపర్ హిట్టైంది. ఆ తర్వాత బీజేపీలోకి జోరుగా వలసలు జరిగాయి. నియోజకవర్గంలోని దాదాపు 90 శాతం మంది కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రతినిధులు కమలం గూటికి చేరారు, అధికార టీఆర్ఎస్ నుంచి పదుల సంఖ్యలో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నేతలు బీజేపీలో చేరారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతున్న రాజగోపాల్ రెడ్డి సమక్షంలో రోజూ ఎవరో ఒకరు కాషాయ కండువా కప్పుకుంటూనే ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో ఉండటం.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారు కాకపోవడంతో రాజగోపాల్ రెడ్డి మరింత జోరు పెంచారు. వివిధ పార్టీల నేతలు కూడా పోటీ పడి మరీ ఆయనకు మద్దతుగా వెళ్లారు. కోమటిరెడ్డి స్పీడుతో మునుగోడు ఉప ఎన్నికలో ఆయనకు పోటీ కూడా ఉండదేమో అన్నట్లుగా సీన్ కనిపించింది.కాని క్రమంగా పరిస్థితులు మారిపోతున్నాయి. బీజేపీలో చేరిన నేతలు కొందరు తిరిగి సొంత గూటికి చేరుతున్నారు. చండూరు మండలం దోనిపాముల సర్పంచ్ తిరిగి టీఆర్ఎస్ లోకి వచ్చారు. మునుగోడు మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ లీడర్లు కూడా తిరిగి సొంత గూటికి వచ్చేశారు. ఇది ఇలా ఉండగానే తాజాగా కోమటిరెడ్డికి గ్రామాల్లో నిరసన సెగ ఎదురుకావడం బీజేపీని కలవరపరుస్తోంది
మంగళవారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నాంపల్లి మండలం తుంగపాడు గ్రామంలో షాక్ తగిలింది. బీజేపీ పార్టీ చేరికలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండగా అక్కడి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కాంగ్రెస్ కు పోటీగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ ఘటన కమలం పార్టీని ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటన మరవకముందే మునుగోడు (మం) ఊకొండి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తిరుగుబాటు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ వెంకట్ రెడ్డి ఒత్తిడి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలకు పదేపదే ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడని వెంకట్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ లీడర్లు. బిజెపి లో ఉంటావో,కాంగ్రెస్ లో ఉంటావో తేల్చుకో అంటూ నిలదీశారు.
మునుగోడులో జరుగుతున్న వరుస ఘటనలతో కోమటిరెడ్డి బ్రదర్స్ కలవరపడుతుండగా.. బీజేపీ పెద్దల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోందని తెలుస్తోంది. ఇటీవల వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నేతలు.. చివరి వరకు పార్టీలో ఉంటారో లేదోనన్న అనుమానాలను బీజేపీ ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలతోనే ఉప ఎన్నిక విషయంలో బీజేపీ తొందరపడకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది.