

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వలసల సీజన్ నడుస్తోంది. దూకుడు మీదున్న బీజేపీలోకి జోరుగా నేతలు జంప్ చేస్తున్నారు. తెలంగాణలో పర్యటిస్తున్న బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు సహా పలువురు కీలక నేతలు కమలం గూటికి చేరారు. త్వరలోనే మరిన్నిసంచలనాలు జరగబోతున్నాయని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. కేంద్రమంత్రి డీల్ జరిగిపోయిందని.. త్వరలోనే ఆ ఎమ్మెల్యే కారు దిగి కాషాయ కండువా కప్పుకుంటారనే చర్చ సాగుతోంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన చోకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలకు లింకులున్నాయనే ప్రచారం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యేకు ఈడీ నుంచి నోటీసులు కూడా వచ్చాయనే వార్తలు వచ్చాయి. మనీ లాండరింగ్‌లో ఆయన పాత్ర ఉన్నట్లు ప్రచారం సాగింది. చీకోటి కేసులో లింకులున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారని అంటున్నారు. మంచిరెడ్డికి కేంద్రమంత్రికి సమీప బంధువు. దీంతో కేంద్రమంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అండగా నిలిచారని అంటున్నారు. బీజేపీలో చేరుతానని హామీ ఇవ్వడంతో కేంద్రమంత్రి అతనిని ఈడీ కేసు నుంచి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
తనను ఈడీ కేసు నుంచి తప్పిస్తే బీజేపీలో చేరడానికి సంసిద్దత వ్యక్తం చేశారని తెలుస్తోంది. త్వరలోనే మంచిరెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని బీజేపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. బీజేపీలో చేరితే ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం టికెట్ విషయంలోనూ బీజేపీ పెద్దల నుంచి హామీ వచ్చిందని చెబుతున్నారు. మంచిరెడ్డిపై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారని.. ప్రభుత్వ పెద్దల సాయంతో బయటపడారనే విమర్శలు ఉన్నాయి. మంచిరెడ్డికి ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయని.. దేశంలోని పలువురు ప్రముఖులతో బిజినెస్ డీల్స్ ఉన్నాయని అంటున్నారు. మంచిరెడ్డి కుమారుడికి చీకోటి ప్రవీణ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. వ్యాపారాల్లోనూ లింకులు ఉన్నాయని తెలుస్తోంది. చీకోటి ప్రవీణ్ తో ఎమ్మెల్యే న్యూజిలాండ్‌లో సెటిల్మెంట్లు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో ఈడీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయంటున్నారు.