

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం జరిగింది. కొన్ని రోజులుగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు హాట్ కామెంట్లతో కాక రేపుతున్నారు. పార్టీల పోటాపోటీ వ్యూహాలతో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. హన్మకొండ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కు జైలు గది సిద్ధం చేశామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేసీఆర్ కుటుంబ అవినీతి చిట్టా తమ దగ్గర ఉందని… త్వరలోనే కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ ను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన కామెంట్లు ప్రకంపనలు రేపుతున్నాయి.
తాజాగా బీజేపీకి దిమ్మతిరిగే షాకిచ్చేలా కాంగ్రెస్ మరో కార్యక్రమం చేపట్టింది. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం సోమవారం కరీంనగర్ జైలుకు వెళ్లనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం జైల్లో ప్రత్యేక గదిని తయారు చేశామని బండి సంజయ్ ప్రకటించడంతో.. ఆ గదిని చూసేందుకు వెళ్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సోమవారం ఉదయం కరీంనగర్ జైలుకు వెళ్లి బండి సంజయ్ చెప్పిన కేసీఆర్ కోసం సిద్ధం చేసిన గది ఎక్కడుందో, ఎలా ఉందో చూసి వస్తామని చెప్పారు. బండి సంజయ్ చెప్పిన జైలు గది ప్రకటన నిజమేనా లేక రాజకీయ పబ్బం కోసం చెప్పిన మాటలా అన్నది జనాలకు తెలియచేయడానికే కరీంనగర్ జైలుకు వెళ్తున్నామని తెలిపారు పొన్నం ప్రభాకర్.
గత రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిని జైల్లోకి పంపుతాం పంపుతాం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకొని అమిత్ షా నడ్డా కిషన్ రెడ్డి లక్ష్మణ్ బండి సంజయ్ పదే పదే చెబుతున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బండి సంజయ్ ఇప్పుడు ఏకంగా కరీంనగర్ జైల్లో గదినే తయారు చేశామని చెప్పారని.. ఆ గది ప్రత్యేకతలు చూడటానికే తాము కరీంనగర్ జైలుకు వెళ్తున్నామని పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. బీజేపీ నేతలు చెబుతున్న మాటల సారాంశం ఏంటో జనాలకు చూపిస్తామన్నారు.
EniDxXogW