
హైదరాబాద్ పాతబస్తీలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. పాతబస్తీలో పలు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల ఆంక్షలు విధించారు. ముఖ్యంగా చార్మినార్, శాలిబండ, హుస్సేనీ ఆలం వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు మరింత పెంచారు. సాయంత్రం 7 గంటల వరకే దుకాణాలకు తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చిన పోలీసులు.. ఆ తర్వాత అన్నింటినీ మూసివేయాలని విజ్ఞప్తిచేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాల్లో కలియ తిరుగుతున్న పోలీసులు.. 7 గంటలకే అన్ని వ్యాపారాలు మూసేయాల్సిందిగా మైకులో అనౌన్స్‌మెంట్స్ ఇస్తుండటాన్ని బట్టి చూస్తే అక్కడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
నిన్న అర్థరాత్రి జరిగిన పలు హింసాత్మక ఘటలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సౌత్ జోన్ పోలీసులు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను రంగంలోకి దింపారు. ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్.. నగర పౌరులు అల్లర్లకు పాల్పడొద్దని హెచ్చరించింది. బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రొఫెట్ మొహమ్మద్‌ని కించపరిచేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ ముస్లిం సంఘాలు, ముస్లిం సోదరులు మంగళవారం భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
రాజాసింగ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మొదలైన ఈ అలజడి అంతటితో ఆగలేదు. రాజాసింగ్‌కి బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం అర్థరాత్రి దాటాకా సైతం పలువురు నిరసనకారులు పలు ప్రాంతాల్లో అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. శాలిబండ, హుస్సేనీ ఆలం, చార్మినార్ ప్రాంతాల్లో ఈ ఆందోళనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. చార్మినార్ వద్ద అర్ధరాత్రి ఆందోళనకు దిగిన నిరసనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆందోళనకారులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత మరోమారు తెల్లవారుజామున 3 గంటలకు ఆందోళనకారులు ఒక్క చోట చేరి నిరసనకు దిగగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నేడు పోలీసులు ముందుగానే సమస్యాత్మక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.
One Comment