
గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యేను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. విద్వేష ప్రసంగం కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నాంపల్లి కోర్టు నుంచి భారీ భద్రత నడుమ రాజాసింగ్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. రాజాసింగ్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురాగా.. అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. రాజాసింగ్ కు మద్దతుగా కొందరు.. వ్యతిరేకంగా మరికొందరు కోర్టు దగ్గరకు వచ్చారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.
దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో బీజేపీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. బీజేపీ నుంచి రాజాసింగ్‌ను సస్పెండ్ చేసింది. ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సెప్టెంబర్ 2లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. రాజాసింగ్ విడుదల చేసిన వీడియోపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రాజాసింగ్‌పై కేసులు నమోదు అయ్యాయి.
శాసనసభాపక్ష నేత పదవి నుంచి కూడా తప్పించారు. రాజాసింగ్ వీడియోపై మైనార్టీల ఆందోళనలు నిర్వహించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు యూట్యూబ్ నుంచి వీడియోను తొలగించారు.దీనిపై దిద్దుబాటు చర్యలకు దిగిన బీజేపీ హైకమాండ్..రాజాసింగ్‌పై వేటు వేసింది. ఇటీవల యూపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆ పార్టీకి చెందిన నుపుర్ శర్మ..మహ్మద్ ప్రవక్తకు సంబంధించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెను దుమారం రేగింది. ఆ వీడియోను టాగ్ చేసిన వ్యక్తులు సైతం హత్యకు గురైయ్యారు. ఈక్రమంలో నుపుర్ శర్మను పార్టీ నుంచి బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది.