
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సికింద్రాబాద్ లోని సాంబమూర్తి నగర్ కాలనీకి చేరుకున్నారు. కాలనీ పరిధిలోని కళాసిగూడలో ఉన్న బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. అమిత్ షాకు స్థానిక కార్పొరేటర్ స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర హోం మంత్రిని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ తన ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సత్యనారాయణ అందించిన వేడివేడి కాఫీని షా తాగారు.కాఫీ తాగుతూ.. సత్యనారాయణ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ ఇంటికి అమిత్ షా చేరుకోగానే స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. దీంతో వారిని పోలీసులు అదుపు చేశారు. సత్యనారాయణ ఇంట్లోకి కేవలం అనుమతి ఉన్న అతికొద్ది మందిని మాత్రమే అనుమతించారు. షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాకపై సాంబమూర్తి నగర్ కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి.. సామాన్య బీజేపీ కార్యకర్త ఇంటికి వస్తారని తాము ఊహించలేదని బస్తీ వాసులు చెప్పుకొచ్చారు. బీజేపీలో చిన్నపాటి కార్యకర్తకు కూడా గుర్తింపు ఉంటుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని వెల్లడించారు. దళిత వాడకు వచ్చి అమిత్ షా కాఫీ తాగడం.. బలహీన వర్గాలపై బీజేపీ దృక్పథాన్ని చాటి చెబుతోందని స్థానికులు అభిప్రాయపడ్డారు. స్థానికంగా కాలనీలో ఎన్నో సమస్యలున్నాయని.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.