
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : మునుగోడు ప్రజా దీవెన సభలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు సీఎం కేసీఆర్. దేశంలో వ్యవసాయాన్ని కార్పోరేట్ల పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వ్యవసాయానికి మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారని.. ఎరువుల ధరలు పెంచుతున్నారని పేర్కొన్నారు. రైతులు, పేదలకు వివిధ పథకాల కింద డబ్బులు ఎందుకు ఇస్తున్నారని కేంద్ర మంత్రి ఒకరు తమతో అన్నారని వెల్లడించారు.
కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిదేళ్లు అయిందని.. ఇప్పటికీ కృష్ణా నదిలో నీటి వాటా తేల్చకుండా తాత్సారం చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నీటి వాటాలు ఎందుకు తేల్చడం లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరుపై పోరాడుతామన్నారు. పోరాటాలు తెలంగాణకు కొత్త కాదని.. కొట్లాడటం మొదలుపెడితే ఎక్కడిదాకా అయినా వస్తామని వ్యాఖ్యానించారు. మా నీటి వాటా మాకు ఇవ్వనందుకే అమిత్ షా తెలంగాణకు వస్తున్నారా? బిడ్డా.. అమిత్ షా సమాధానం చెప్పాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకపోవడానికి కారణమేంటో చెప్పాలి. మా నీటి వాటా తేల్చితే అందుకు అనుగుణంగా ప్రాజెక్టులను పూర్తిచేసుకుంటాం. కానీ తేల్చకుండా అడ్డం ఎందుకు పడుతున్నారు?” అని కేసీఆర్ ప్రశ్నించారు.
‘‘పంద్రాగస్టు నాడు ప్రధాన మంత్రి మాట్లాడితే మైకులు పగలిపోయాయి. అందులో ఒక్క మాట అయినా మంచి మాట ఉందా? బీజేపీ నేతలుగానీ, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిగానీ, రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తిగానీ ఢిల్లీ వెళ్లి.. తెలంగాణకు కృష్ణా నీటి వాటా తేల్చడం లేదేమని అడగగలరా? లేదు. కానీ రేపు డోలు, బాజాలు పట్టుకుని అమిత్ షాను మునుగోడుకు తీసుకొస్తారట. నేను కేంద్ర హోం మంత్రిని డిమాండ్ చేస్తున్నా.. మీరు కృష్ణా జలాల వాటా ఎందుకు తేల్చడం లేదు? ఈ విషయంలో మీ కేంద్ర ప్రభుత్వ విధానం ఏమిటో సమాధానం చెప్పాలి. మీ దద్దమ్మ, చేతగానితనం ఏమిటో రేపు మునుగోడు సభలో చెప్పాలని డిమాండ్ చేస్తున్నా..” అని కేసీఆర్ మండిపడ్డారు.
‘‘ప్రజలు ఒక్క మాట బాగా గమనించాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి ఎనిమిదేళ్లు అయింది. ఒక్క మంచి పని అయినా జరిగిందా? ఎవరికి జరిగింది. దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికులు, రైతులు.. ఎవరికి మేలు జరిగింది. కనీసం ఒక్కటైనా మంచి పని లేదు. మరి ఏం చేస్తున్నారు? పైగా విమానాశ్రయాలు, రైళ్లు, బ్యాంకులు, గ్యాస్ కంపెనీలు, రోడ్లు.. ఇలా అన్నింటినీ అమ్మేయడం మొదలుపెట్టారు.” అని కేసీఆర్ మండిపడ్డారు.
Read More : “చే “జారిపోతున్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్… పత్తాకులేని పార్టీ నేతలు
‘‘ఇప్పుడు రైతులు, భూములు, వ్యవసాయ పంటలపై పడుతున్నారు. రైతులకు, రైతు కూలీలకు నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం జరుగుతోంది. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. కానీ నేను చచ్చినా వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టబోనని తేల్చి చెప్పాను. మీటర్లు పెట్టడం ఒక్కటే కాదు.. దీని వెనుక చాలా మతలబు ఉంది.. ఎరువుల ధరలు పెంచాలి, కరెంటు ధర పెంచాలి, పండిన పంటలు కొనొద్దు.. రైతులు ఇక తాము వ్యవసాయం చేయలేమని చాలించుకోవాలి. ఇలా ఉంది కేంద్ర ప్రభుత్వ విధానం. రైతులు వ్యవసాయం చేయలేమంటే.. మోదీ దోస్తులు సూట్ కేసులు పట్టుకుని రెడీగా ఉన్నారు. మీ భూములు మాకు ఇచ్చేయండి. కార్పోరేట్ వ్యవసాయం పెడదాం. మీరు మా వద్దే కూలీలుగా పనిచేయండి.. ఇదే వారి కుట్ర. అంతా దీనిని గమనించాలి.” అని కేసీఆర్ సూచించారు.
ఇవి కూడా చదవండి ..
- కూసుకుంట్లకు షాకిచ్చిన కేసీఆర్… బీసీ నేతకే మునుగోడు టీఆర్ఎస్ టికెట్?
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తా.. మునుగోడులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
- టిఆర్ఎస్ కు మద్దతుగా కమ్యూనిస్టు నేతలు… ప్రజల ఆశలు మట్టిపాలు
- అందరి కళ్ళు మునుగోడుపైనే… సిఎం కేసిఆర్ సభలో ఏం మాట్లాడబోతున్నాడు ???
- మునుగోడులో కాళ్లు మొక్కి ఓట్లు అడగనున్న రేవంత్ రెడ్డి