
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిది : మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ప్రజా దీవెన సభ ముగిసింది. భారీ బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. బిడ్డా అమిత్ షా అంటూ హెచ్చరించారు. అయితే మునుగోడు సభలో టీఆర్ఎస్ అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారైందని.. మునుగోడు సభలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారనే ప్రచారం సాగింది. కాని కేసీఆర్ మాత్రం అభ్యర్థిని ప్రకటించకుండానే సభను ముగించారు. దీంతో మునుగోడు అభ్యర్థి విషయంలో కేసీఆర్ మనసు మారిందా అన్న చర్చ సాగుతోంది.
మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతి తీవ్రంగా ఉంది. నియోజకవర్గంలోని టీఆర్ఎస్ స్థానిక సంస్థల ప్రతినిధుల్లో దాదాపు 80 శాతం మంది కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్నారు. అసమ్మతి జిల్లా మంత్రికి జగదీశ్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపినా దారికి రాలేదు అసమ్మతి నేతలు. ఏకంగా 3 వందల మంది నేతలు ప్రత్యేకంగా సమావేశమై కూసుకుంట్లకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు.అంతేకాదు కేసీఆర్ జన సమీకరణ కోసం మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలను ఇంచార్జులుగా నియమించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారం రోజుల పాటు గ్రామాల్లో తిరిగారు. జనసమీకరణ చేస్తూనే పార్టీ కార్యకర్తల, జనాల నాడి తెలుసుకున్నారు. కూసుకుంట్లపై తీవ్ర వ్యతిరేకత ఉందని వాళ్లకు తెలిసిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. దీంతో మునుగోడు అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. మునుగోడు అభ్యర్థి విషయంలో పీకే టీమ్ తో సీఎం కేసీఆర్ మరోసారి సర్వే నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
మునుగోడు నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉండటంతో ఆ దిశగా సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో 67.5 శాతం బీసీ ఓటర్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గ ఓటర్లు మరో 15 శాతం వరకు ఉన్నారు. గతంలో ఎప్పుడు లేనంతగా నియోజకవర్గంలో బీసీ నినాదం వినిపిస్తోంది. పార్టీలకు అతీతంగా బీసీ నేతలు ఏకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ కురువృద్దుడు జానారెడ్డిని ఓడించడంలో బీసీ వాదమే అధికార పార్టీకి కలిసివచ్చింది. అందుకే మునుగోడులోనూ బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. మునుగోడు నుంచి బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్,భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్ పోటీ పడుతున్నారు. బీసీ అభ్యర్థి విషయంలో కేసీఆర్ సీరియస్ గా కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి …
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తా.. మునుగోడులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
- టిఆర్ఎస్ కు మద్దతుగా కమ్యూనిస్టు నేతలు… ప్రజల ఆశలు మట్టిపాలు
- బిడ్డా మోడీ, అమిత్ షా.. ఏం పీక్కుంటారో పీక్కోండి.. మునుగోడు సభలో కేసీఆర్ సవాల్
- అందరి కళ్ళు మునుగోడుపైనే… సిఎం కేసిఆర్ సభలో ఏం మాట్లాడబోతున్నాడు ???
- మునుగోడులో కాళ్లు మొక్కి ఓట్లు అడగనున్న రేవంత్ రెడ్డి