
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక వాతావరణం చోటు చేసుకుంది. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ రాకముందే రాజకీయ పార్టీలు హంగామా మొదలుపెట్టడంతో మునుగోడులో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరుకుంది. ఒకరిని మించి ఒకరు రాజకీయ ఎత్తుగడలతో మునుగోడులో జెండా ఎగురవేయాలని ప్రయత్నం చేస్తున్నారు. తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే, కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి, అధికార పార్టీగా తమ పట్టు నిలుపుకోవాలని టిఆర్ఎస్ మునుగోడులో శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ప్రత్యర్థి నేతలను ప్రలోభపెట్టేందుకు టీఆర్‌ఎస్, బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ముమ్మరం చేశాయి. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు, అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీల స్థానిక నాయకులను తమ పార్టీలోకి ఆకర్షించడానికి ‘ఆపరేషన్ ఆకర్ష్’ను ముమ్మరం చేశాయి. ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు ఇలా క్షేత్ర స్థాయి నాయకులను టార్గెట్ చేస్తున్నాయి.
Also Read : రేపు మునుగోడులో ముఖ్యమంత్రి భాహిరంగసభ… సభలో కేసీఆర్ వరాల జల్లు, కీలక ప్రకటనలు ??
నాయకులు పార్టీ మారితే పార్టీలు బలహీనపడతాయని, తమకు లాభం చేకూరుతుందనే నమ్మకంతో అన్ని రాజకీయ పార్టీలు నాయకులను పార్టీ మార్చడానికి ప్రయత్నం చేయడంతో వీరికి డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. టిఆర్‌ఎస్ మరియు బిజెపి నాయకులు ఈ ప్రయత్నంలో కాస్త సఫలం అవుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ నుండి కొందరు నాయకులు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి కొందరు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక బీజేపీ నుండి కూడా టీఆర్ఎస్ కు వలసలు సాగుతున్నాయి. ఇక నాయకులను మరియు క్యాడర్‌ను పార్టీ మారకుండా ఆపలేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. చేరికల విషయంలో కాంగ్రెస్ వెనుకబడింది. ఈ పరిస్థితిని కాంగ్రెస్ నిస్సహాయంగా చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకపక్క కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు, టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే వర్గం తీరు, మరోపక్క ప్రత్యర్థి పార్టీల వ్యూహాత్మక ఎత్తుగడలతో పార్టీ ఫిరాయింపులను టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆపలేకపోతున్నారు. కాంగ్రెస్ నేతలకు డబ్బు, ఇతరత్రా ప్రోత్సాహకాలతో ప్రలోభపెట్టి, పార్టీ ఫిరాయించేలా చేసి ఉప ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోందని పార్టీ ఫిరాయింపులపై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, రేపు మునుగోడులో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ముందుగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సమక్షంలో లాంఛనంగా పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నంలో వీలైనంత ఎక్కువ మంది నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను టీఆర్‌ఎస్ వేగవంతం చేసింది.
Read Also : మునుగోడులో ప్రచారానికి ముందుకొచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
మరోవైపు, ఆగస్ట్ 21న మునుగోడులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశానికి ముందే ‘ఆపరేషన్ ఆకర్ష్’ పూర్తి చేయాలని, ఆ సందర్భంగా వారిని పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా ఈటల రాజేందర్ మునుగోడు నియోజకవర్గంలో శరవేగంగా పావులు కదుపుతున్నారు. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ఆగస్టు 21న తనతో పాటు గణనీయమైన సంఖ్యలో కాంగ్రెస్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులను తీసుకెళ్లే పనిలో ఉండగా, బీజేపీలో చేరేందుకు ఇష్టపడని కాంగ్రెస్ స్థానిక నేతలపై టీఆర్‌ఎస్ కన్ను పడింది. బీజేపీలో చేరడానికి ఇష్టంలేని నేతలతో మంతనాలు జరిపి వారిని వెంటనే టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకునేలా టీఆర్‌ఎస్ అధిష్టానం పావులు కదుపుతోంది. గత వారం రోజులుగా పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. కేవలం నాలుగురోజుల వ్యవధిలో 14 మంది సర్పంచ్‌లు, ముగ్గురు ఎంపీటీసీలు మరియు కాంగ్రెస్‌కు చెందిన ఇతర స్థానిక నాయకులను టీఆర్‌ఎస్ చేర్చుకుంది. ఆగస్టు 20న జరిగే సీఎం సమావేశానికి ముందు అలాంటి నాయకులను మరింత మంది చేర్చుకోవాలని ఆలోచనలో ఉంది. ఇటీవల కొంతమంది బీజేపీ స్థానిక నాయకులను కూడా టిఆర్ఎస్ తమ పార్టీలోకి ఆహ్వానించింది . ఇలా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ తో నాయకులను పార్టీ మార్చడానికి బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు పోటీపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
- అద్దాల్లా మెరవబోతున్న మునుగోడు రోడ్లు.. రాజగోపాల్ రెడ్డికి జై కొడుతున్న జనాలు
- తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతుందా? ప్రధాని మోడీపై కేసీఆర్ సెటైర్లు..
- తిరుమలలో మంత్రి రోజా హడావుడి…. ప్రతిపక్షాల తీరుపై మండిపాటు
- చంద్రబాబులో ఆ మార్పుతో – ఊహించని విధంగా..!!
- తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో ఆరుగురి అరెస్టు?