
తెలంగాణలో అత్యంత కీలకమైన మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ఉన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ సీనియర్లను నమ్ముకోకుండా స్వయంగా తానే రంగంలోకి దిగాలని డిసైడయ్యారు. ఈ నెల 20 నుంచి మునుగోడులో ఉంటూ ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న రేవంత్‌రెడ్డికి మునుగోడు ఉప ఎన్నిక అగ్నిపరీక్షగా మారింది. ఓ వైపు సీనియర్ల సహాయనిరాకరణ.. మరోవైపు పార్టీ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాల్సిన ఆవశ్యకత రేవంత్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అందుకే ఎవరు సహకరించినా.. లేకున్నా ఒంటరిగానైనా యుద్ధరంగంలోకి దిగనున్నారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ కంచుకోటైన మునుగోడులో కేడర్‌లో ఆత్మస్థైర్యం నింపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన వారం లోపే భారీ బహిరంగ సభ నిర్వహించి కదనరంగంలోకి దూకారు. మునుగోడులో ఎలాగైనా గెలిచితీరాల్సిందేనని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.రేవంత్‌రెడ్డి ఇంత చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మాత్రం మునుగోడును అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు.మునుగోడులో గెలిస్తే క్రెడిట్ అంతా రేవంత్రెడ్డికే వెళ్తుందని.. అప్పుడు ఆయన్ను అడ్డుకోవడం ఎవరితరం కాదన్న భావనలో ఉన్నారట కాంగ్రెస్ సీనియర్లు. దీంతో సమావేశాలకు వస్తున్నా.. సీరియస్ వర్క్ మాత్రం చేయడంలేదట. దీంతో స్వయంగా తానే రంగంలోకి దిగాలని డిసైడయ్యారు రేవంత్.
ప్రస్తుతం కరోనా లక్షణాలతో క్వారంటైన్‌లో ఉన్న ఆయన.. రోజుకో వీడియో రిలీజ్ చేస్తూ కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు ఈ నెల 20 న సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. 21 న అమిత్ షా బహిరంగ సభ ద్వారా ఉప ఎన్నికల సమరశంఖాన్ని పూరిస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు. వాటికి ధీటుగా కాంగ్రెస్ కూడా నిలబెట్టడానికి రేవంత్ బరిలోకి దిగుతున్నారు.ఈ నెల 20 నుంచి మునుగోడులోనే ఉంటానని స్పష్టంచేశారు. పార్టీ మారొద్దని శ్రేణులకు విజ్ఞప్తిచేశారు. మునుగోడులో సర్పంచ్, ఎంపీటీసీలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికలయ్యేదాకా అక్కడే ఉండాలని డిసైడయ్యారట రేవంత్. అలా అయితేనే కేడర్‌ను కాపాడుకోవచ్చని… ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవచ్చని భావిస్తున్నారట. ఎవరినీ నమ్ముకోకుండా ఒంటిరి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారట.
2 Comments