
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంపై అధికార టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుంది. అందుకే మునుగోడుపై ఉప ఎన్నిక కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఉన్న మంత్రి హరీష్ రావుకు మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది.సీఎం కేసీఆర్ ఆదేశాలతో మునుగోడుపై హరీష్ రావు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిలతో పాటు నల్గొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తో హరీష్ రావు మంతనాలు సాగిస్తున్నారని అంటున్నారు.
మంత్రి హరీష్ రావు త్వరలోనే మునుగోడు నియోజకవర్గంలో పర్యటించనున్నారని చెబుతున్నారు. పార్టీ కేడర్ ను అప్రమత్తం చేయడంతో పాటు పార్టీలో నెలకొన్న వర్గపోరును సెట్ రైట్ చేసేలా హరీష్ రావు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉంది. 2018లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోయినా.. ఆయనకు 74 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2014లో గెలిచినప్పుడు వచ్చిన ఓట్ల కంటే 2018లోనే కారుకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2014లో కూసుకుంట్ల గెలిచినప్పుడు ఆయనకు 69 వేల 496 ఓట్లు రాగా.. 2018లో ఓడిపోయినప్పుడు 74 వేల 687 ఓట్లు వచ్చాయి. 2018లో వామపక్షాలతో పాటు బీజేపీ ఓట్లు కొన్ని రాజగోపాల్ రెడ్డికి పడ్డాయని గులాబీ నేతలు చెబుతున్నారు.
Read More : వరదలో కొట్టుకుపోయిన పడవ… ఎమ్మెల్యే సీతక్క తప్పిన పెను ప్రమాదం
తాజాగా ఉప ఎన్నిక రానుండటంతో మునగోడు నియోజకవర్గంలోని తాజా పరిస్థితులపై పీకే టీమ్ ద్వారా కేసీఆర్ సర్వే చేయించారు. సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా మంత్రి హరీష్ రావు పార్టీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. ఇంటలిజెన్స్ నుంచి కేసీఆర్ నివేదిక తెప్పించుకున్నారట. ఇంటలిజెన్స్ రిపోర్టులో టీఆర్ఎస్ ముందుండగా.. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉందని తెలుస్తోంది. బీజేపీకి 10 శాతం ఓట్లు కూడా లేదని తెలిందట. పార్టీకి సానుకూల పరిస్థితులు ఉండటంతో నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగిస్తే విజయం సులభమనే అంచనాలో గులాబీ నేతలు ఉన్నారంటున్నారు. మునుగోడు ఆపరేషన్ ప్రారంభించిన హరీష్ రావు.. టికెట్ ఆశిస్తున్న నేతలతో స్వయంగా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉండటంతో ఆదిశగా కూడా హరీష్ రావు చర్చలు జరుపుతున్నారట. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించడంతో తమకు విజయం ఖాయమనే ధీమా మునుగోడు టీఆర్ఎస్ కేడర్ లో వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి …
- మునుగోడు టిఆర్ఎస్ లో ముసలం.. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వవద్దని సొంత పార్టీ నేతల డిమాండ్
- అవినీతి ఆరోపణలపై అధికారుల నిర్లక్ష్యం
- మునుగోడు ఉపఎన్నికలో ఓటుకు 30 వేలు!
- తుర్కయంజాల్‌లో వెలుగులోకి వస్తోన్న కౌన్సిలర్ అక్రమ బాగోతాలు
- కేంద్రం రద్దు చేసిన చట్టాల్లో ఏముంది? రైతులు ఎందుకు వ్యతిరేకించారు?