
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : రాజకీయాలన్ని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించడంతో అన్ని పార్టీల ఫోకస్ మునుగోడుపైనే పడింది. త్వరలో ఉప ఎన్నిక రానుండటంతో నియోజకవర్గంలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి.. తాజాగా మునుగోడు టీఆర్ఎస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. నియోజకవర్గంలోని బీసీ లీడర్లంతా ఏకమయ్యారు. కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది.
మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మునుగోడు నుంచి పోటీ చేయడానికి అర డజనుకు పైగా నేతలు లైన్ లో ఉన్నారు. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. ఉప ఎన్నికలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ రేసులో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్ టికెట్ రేసులో ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 70 శాతం ఓటర్లు బీసీలే. కాని ఎస్సీ, ఎస్టీలు కలిపితే బడుగు. బలహీన వర్గాల ఓటర్లు దాదాపు 92 శాతం ఉన్నారు. అయినా ఈ వర్గాల నుంచి ఇప్పటివరకు ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదు.
మునుగోడు నియోజకవర్గానికి ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరగగా అన్ని సార్లు ఓసీలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. నియోజకవర్గంలో కేవలం ఏడు శాతం మంది ఓటర్లున్న రెడ్డి నేతలు ఎనిమిది సార్లు గెలవగా.. కేవలం ఒక్క శాతం ఓటర్లు ఉన్న వెలమలు నాలుగు సార్లు గెలిచారు. అయితే ఈసారి మాత్రం ఎలాగైనా మునుగోడు గడ్డపై బీసీ జెండా ఎగురవేయాలని బీసీ నేతలు డిసైడ్ అయ్యారు. అందుకే మునుగోడు టికెట్ ఆశిస్తున్న బీసీ నేతలంతా ఏకమయ్యారు. నియోజకవర్గంలోని చండూరు ,మునుగోడులో నిర్వహించిన ఆచార్య ప్రొ.కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో బీసీ లీడర్లు కలిసి పాల్గొన్నారు. డాక్టర్ బూర నర్సయ‌్య గౌడ, నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్ కలిసి పలు కార్యక్రమాలు నిర్వహించారు. మరో బీసీ నేత కర్నె ప్రభాకర్ కూడా వీళ్లకు మద్దతు తెలిపారు.
మునుగోడు నియోజకవర్గంలో 90 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాల ఓటర్లు ఉన్నందున ఈసారి ఖచ్చితంగా ఆ వర్గాలకే టికెట్ ఇవ్వాలని బీసీ నేతలు కోరుతున్నారు. బీసీ నేతల్లో ఎవరికి టికె్ట ఇచ్చినా తాము కలిసి పని చేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వొద్దని.. ఒక వేళ ఇస్తే తాము సపోర్ట్ చేసేది లేదని పార్టీ పెద్దలకు స్పష్టం చేయాలని మునుగోడు బీసీ టీఆర్ఎస్ లీడర్లు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో మునుగోడు టీఆర్ఎస్ నేతలు ఏకం కావడం ఆసక్తిగా మారింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు వ్యతిరేకంగానే వీళ్లంతా ఏకమయ్యారనే టాక్ వస్తోంది. అంతేకాదు బీసీ నేతలే కాకుండా కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్న రెడ్డి లీడర్లంతా బూర టీమ్ కు మద్దతు తెలుపుతుందని తెలుస్తోంది. చౌటుప్పల్ మాజీ జడ్పీటీసీ బుచ్చిరెడ్డి కూడా వీళ్లతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కూసుకుంట్ల వ్యతిరేకులను మొత్తం ఏకం చేసే పనిలో బీసీ నేతలు ఉన్నారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి …
- మునుగోడుపై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్! ఒకే దెబ్బకు మూడు పిట్టలు..
- కోమటిరెడ్డికి క్షమాపణ చెప్పిన అద్దంకి దయాకర్
- గాలి తప్ప అన్నిటిమీదా పన్నే!.. పాలపై జీఎస్టీ ఎత్తేయాలని కేసీఆర్ డిమాండ్
- నాంపల్లి సీఐ శంకర్ రెడ్డి పై బదిలీ వేటు.
- జనసేనలోకి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విరాజ్…
3 Comments