
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నరేంద్ర మోడీ సర్కార్ పై మరోసారి నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. రాజ్యాంగంలో భారత దేశాన్ని సంక్షేమ రాజ్యంగా అభివర్ణించారని, కానీ దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక రాష్ట్రంలో మరణించిన వారిని సైకిళ్లపై తీసుకెళ్తున్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికైనా పాల మీద ఆ దిక్కుమాలిన జీఎస్టీ ఎత్తివేయాలని ప్రధానికి తెలంగాణ ప్రజల తరఫున చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. బీడీ కంపెనీలు మూతపడితే ఆ కార్మికులు బతకలేరు. వాటిపై కూడా జీఎస్టీ తొలగించండి. దేశంలో కోటానుకోట్ల చేనేత కార్మికులు ఉన్నారు.
రాష్ట్రంలో వారికి కొత్తగా బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం. చేనేత పరిశ్రమ అసలే నష్టాల్లో ఉంది. చేనేత కార్మికులు బతకడానికి నానా తిప్పలూ పడుతుంటే.. వారిపై కూడా జీఎస్టీ బాదుడు వేయడం సబబేనా? ఇది కూడా ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతం గాలి మీద తప్ప అన్నిటిమీదా పన్ను వేస్తున్నారు.. ఇది ఏం అన్యాయం?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని.. కేంద్ర ఆ పని చెయ్యకపోగా ఏదైనా రాష్ట్రం చేస్తుంటే కాళ్లు చేతులు కట్టేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులపాటు నిర్వహించే గర్బా నృత్య వేడుకలపై కూడా జీఎస్టీ వేయడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు.మూర్ఖులు తను కూర్చున్న చెట్టుకొమ్మను తామే నరుక్కున్నట్లు కేంద్రమే దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ఒక దుర్మార్గమైన చర్యకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కేసీఆర్ చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎం అనే చట్టానికి లోబడి నిధుల కూర్పు జరుగుతుందని, ఇది బడ్జెట్‌లో భాగమని, మార్కెట్ బారోయింగ్స్ అనేవి దీనిలో అంతర్భాగమని వివరించారు.
‘‘రాష్ట్రాలలో ఉండే పబ్లిక్ సెంటర్ యూనిట్లు కొన్ని అప్పులు తీసుకొని ఆ తర్వాత చెల్లిస్తారని, ఇప్పుడు వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల్లాగే పరిగణిస్తామని కేంద్రం చెప్పింది. దీని ప్రకారమే రాష్ట్రానికి రావలసిన 54 వేల కోట్లలో 25 వేల కోట్ల కోత విధించారు. అంతకుముందు ఎలక్ట్రిసిటీలో ఉదయ్ అనే పథకం తెచ్చారు. దీనిపై కొంత అప్పు తీసుకున్నాం. ఇప్పుడు అది కూడా రాష్ట్ర నిధుల్లో కోత పెడతామని అన్నారు. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్తామని ఢిల్లీలో లెటర్ ఇచ్చి వచ్చాను. అప్పుడు పది వేల కోట్లు అప్పు తగ్గించి, రాష్ట్రానికి రావలసిన నిధులను 39 వేల కోట్లు చేశారు. మిగతా 15 వేల కోట్ల గురించి కూడా అడుగుతున్నాం . ఇదేనా టీమిండియా అంటే?’’ అని కేసీఆర్ దుయ్యబట్టారు.
పాల మీద, స్మశానాల మీద, చేనేత మీద, అల్పాదాయ వర్గాల మీద వేసిన జీఎస్టీ భారాన్ని విరమించాలనేదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన డిమాండ్ అని కేసీఆర్ తేల్చిచెప్పారు. అలాగే ఎఫ్‌ఆర్బీఎం పేరిట కోతలు విధించడం వల్ల రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడుతుందని, ఇది తొలగించి రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడాలని కోరారు. బలహీనమైన రాష్ట్రాలు ఉంటే దేశం కూడా బలహీనం అయిపోతుందని, బలమైన రాష్ట్రాలు ఉంటేనే దేశం శక్తిమంతంగా మారుతుందని వివరించారు. నీతి ఆయోగ్ ఆరంభం సమయంలో చెప్పిన మాటలు డొల్లమాటలు కాదని నిరూపించాలని ప్రధాని మోదీని కోరారు. ఆయనపై తనకు వ్యక్తిగత కోపం లేదని, కానీ ప్రజల ప్రయోజనాల కోసం తాము నూటికి నూరుశాతం పోరాడతామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి …
- మునుగోడుపై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్! ఒకే దెబ్బకు మూడు పిట్టలు..
- మునుగోడులో కూసుకుంట్లకు చెక్.. ఏకమైన టీఆర్ఎస్ బీసీ నేతలు
- కోమటిరెడ్డికి క్షమాపణ చెప్పిన అద్దంకి దయాకర్
- నాంపల్లి సీఐ శంకర్ రెడ్డి పై బదిలీ వేటు.
- జనసేనలోకి 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విరాజ్…