
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సీనియర్ నేత ,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అధికారికంగా గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీని ఆయన తన రాజీనామా లేఖను పంపించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో తెలిపారు రాజగోపాల్ రెడ్డి, ప్రజాస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేసేందుకు దారి తీసిన పరిణామాలను లేఖలో కోమటిరెడ్డి వివరించారు.
గత ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా, ప్రజాప్రతినిధిగా సోనియా గాంధీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా, ఎక్కడా రాజీపడకుండా కష్టపడ్డానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీలో పనిచేశానని ప్రస్తావించారు. కానీ పార్టీకి విధేయులైన వారిని గత కొంతకాలంగా పదేపదే అవమానిస్తున్నారని అన్నారు. పార్టీ ద్రోహులు, మీ పైనే(సోనియా గాంధీ) వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక పదవులు అప్పగించడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. కాంగ్రెస్‌ను కొందరు నిర్వీర్యం చేశారని ఆరోపించిన కోమటిరెడ్డి.. ఎమ్మెల్యేలను గెలిపించలేని వారు ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపలేకపోయారని విమర్శించారు. అందరి చొరవతో సాకారమైన తెలంగాణ రాష్ట ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బంధీ అయిందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఈ బంధీనుండి విడిపించేందుకు తెలంగాణాలో మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందన్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఈనెల 8న మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఇప్పటికే స్పీకర్ అపాయింట్‌మెంట్ కూడా కోరారు. ఆగస్టు 8న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్పీకర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో 8వ తేదీన స్పీకర్ ను కలిసి తన రాజీనామా లేఖ సమర్పించనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెబుతున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో భారీ సభను నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ సభకు పార్టీ అధినేత జేపీ నడ్డా వస్తారని తెలుస్తోంది. ఆ సభలోనే రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి …
- 10 లక్షల సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకతలు ఇవే..
- 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం? ఏ పార్టీలో చేరబోతున్నారో?
- తెలంగాణ రాష్ట్రంలో బిజేపి “ఆపరేషన్ ఆకర్ష్”….
- నేడు ప్రారంభం కానున్న కమాండ్ కంట్రోల్ సెంటర్…
- రేవంత్ రెడ్డి పై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన సీతక్క…
One Comment