
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో మునుగోడుకు త్వరలో ఉపఎన్నిక రాబోతోంది. దీంతో ప్రధాన పార్టీలన్ని మునుగోడుపై ఫోకస్ చేశాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారనే అంచనాతో గత నెల రోజుల నుంచే నియోజకవర్గంలో తిరుగుతున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. పీసీసీ ముఖ్య నేతలంతా శుక్రవారం మునుగోడుకు రాబోతున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర రెండు రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలోకి ఎంట్రీ కానుంది. ఇలా అన్ని పార్టీలు ప్రస్తుతం మునుగోడు కేంద్రంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
Read More : మునుగోడు ఉపఎన్నిక… తెరపైకి కోత్త డిమాండ్లు…
మునుగోడు గడ్డ మొదటి నుంచి పోరాటాలకు కేంద్రంగా నిలిచింది. వామపక్ష ఉద్యమాలకు ఊపిరిపోసింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇక్కడి నేతలే కీరోల్ పోషించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 20 వేల 520 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 70 శాతం మంది ఓటర్లు బీసీ వర్గాలకు చెందినవారే. గౌడ్, ముదిరాజ్, యాదవ, పద్మశాలి వర్గాల ఓటర్లు భారీగా ఉన్నారు. ప్రభుత్వ వర్గాల లెక్కల ప్రకారం మునుగోడు నియోజకవర్గంలో గౌడ్ ఓటర్లు 35 వేల 150, ముదిరాజ్ ఓటర్లు 33 వేల 900, యాదవ్ 21 వేల 360 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీ మాదిగ 25, 650, ఎస్సీ మాల 10350 మంది ఓటర్లున్నారు. లంబాడా(ఎస్టీ) 10520 మంది ఓటర్లు ఉండగా.. ముస్లింలు 7650 మంది ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు 7 వేల 690 కాగా.. కమ్మ వర్గం ఓటర్లు 5 వేల 680. ఇక వెలమ ఓటర్లు 2360 మంది ఉన్నారు.
Read More : మునుగోడు ఉప ఎన్నిక… మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం
మునుమగోడు నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు దాదాపు 90 శాతానికి పైగా ఉన్నా ఈ వర్గాల నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదు. 1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు కొండూరు నియోజకవర్గంలో భాగంగా ఉండేది. మునుగోడు అసెంబ్లీకి ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరు సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఐదు సార్లు కమ్యూనిస్టులు విజయం సాధించారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. మునుగోడు పేరు చెప్పగానే వినిపించేది మాజీ మంత్రి దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. ఆయన ఇక్కడి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీపీఐ నుంచి ఉజ్జిని నారాయణరావు మూడు సార్లు గెలిచారు. ఆయన కుమారుడు యాదగిరి రావు ఒకసారి గెలిచారు. 2004లో సీపీఐ నుంచి పల్లా వెంకట్ రెడ్డి గెలిచారు. 2014లో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. 2018లో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు.
Read More : త్వరలో కాంగ్రెస్ గూటికి కర్నె ప్రభాకర్! నారాయణపురంలో అనుచరులతో మీటింగ్
మునుగోడుకు ఇప్పటివరకు జరిగిన 12 ఎన్నికల్లోనూ అగ్రవర్గాలకు చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు. రెడ్లు ఎనిమిది సార్లు గెలవగా.. వెలమలు నాలుగు సార్లు గెలిచారు. వెలమ సామాజికవర్గానికి చెందిన సీపీఐ నుంచి పోటీ చేసిన ఉజ్జిని నారాయణ రావు మూడుసార్లు.. ఆయన కొడుకు యాదగిరిరావు ఒకసారి గెలిచారు. అంటే మునుగోడు నియోజకవర్గం ఓటర్లలో కేవలం 3.49 శాతంగా ఉన్న రెడ్లు ఏకంగా ఎనిమిది సార్లు గెలవగా.. కేవలం 1.09 శాతం ఓట్లు ఉన్న వెలమ సామాజికవర్గానికి చెందిన వారు నాలుగు సార్లు గెలిచారు. 90 శాతానికి పైగా ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి మాత్రం అవకాశం రాలేదు. చంద్రబాబు రెండు సార్లు బీసీ అభ్యర్థులను నిలబెట్టినా గెలవలేదు. గతంలో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉండటం వల్లే బీసీ నేతలు గెలవలేకపోయారని అంటారు.
Read More : బీజేపీ కుక్క బిస్కెట్లకు అమ్ముడుపోయాడు! కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్..
కాని గతానికి ఇప్పటికి పరిస్థితి మారిపోయింది. బీసీల్లో చైతన్యం పెరిగింది. అటు రెడ్డి నేతలు చాలా వరకు హైదరాబాద్ కు పరిమితం అయ్యారు. గతంలో లాగా ఒక నేత చెబితే వందల ఓట్లు పడే పరిస్థితి లేదు. దీంతో ఈసారి మునుగోడులో గతంలో ఎప్పుడు లేనంతగా బీసీ వాదం వినిపిస్తోంది. బీసీ అభ్యర్థి బరిలో ఉంటే సమిష్టిగా పోరాడి గెలిపించుకోవాలని బీసీ నేతలు ఆలోచిస్తున్నారని అంటున్నారు. అందుకే ఈసారి ప్రధాన పార్టీలు కూడా బీసీ అభ్యర్థుల వైపు చూస్తున్నాయని తెలుస్తోంది. అందుకే అధికార పార్టీ నుంచి బూర నర్సయ్య గౌడ్, నారబోయిన రవి ముదిరాజ్ రేసులో ముందున్నారని తెలుస్తోంది. గౌడ్, ముదిరాజ్ సామాజిక వర్గాల ఓట్లే ఎక్కువగా ఉండటం వీళ్లకు కలిసివస్తుంది. అటు కాంగ్రెస్ కూడా మునుగోడు స్ట్రాటజీ కమిటి కన్వీనర్ గా మధుయాష్కీ గౌడ్ ను నియమించింది. కాంగ్రెస్ టికెట్ రేసులోనూ బీసీ నేతలైన పల్లె రవికుమార్ గౌడ్, పున్న కైలాస్ నేతలు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికలో బీసీ వాదమే కీలకం కానుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి …
- పెద్దంపేట వాగులో ‘ఈతకు వెళ్లి యువకుడు మృతి’
- మునుగోడులో హుజురాబాద్ సీన్ రిపీట్ కానుందా??
- డ్రోన్ ‘ఎంక్యూ-9 రీపర్’ ను కొనుగోలు చేయనున్న భారత్….
- రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి…
- నిరుద్యోగులకు షాక్… సగానికి పైగా పోస్టులు వారితోనే భర్తీ !!
2 Comments