
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారనుందా? మునుగోడులో హుజురాబాద్ సీన్ రిపీట్ కానుందా? మునుగోడు నియోజకవర్గానికి నిధుల వరద కురిపించడానికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేస్తారా? మంత్రి జగదీశ్ రెడ్డి ఆ పనుల్లో నిమగ్నం అయ్యారా? అన్నది ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read : రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి…
మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గ అభివృద్ధికి టిఆర్ఎస్ పార్టీ నిధులు కేటాయించలేదని గత కొంతకాలంగా మునుగోడు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇక ఇదే విషయాన్ని బాహాటంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నకారణంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మునుగోడు నియోజకవర్గానికి నిధులు కేటాయించలేదని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలంటే నియోజకవర్గ అభివృద్ధిని చూపించాల్సిన అవసరం ఉంది.
Read Also : మునుగోడు ఉపఎన్నిక… తెరపైకి కోత్త డిమాండ్లు…
ఈ క్రమంలోనే మునుగోడు నియోజకవర్గానికి ఇప్పటివరకు మంజూరు చేసిన నిధులను ఇప్పుడు విడుదల చేయడానికి టిఆర్ఎస్ పార్టీ రెడీ అవుతున్నట్లుగా నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఈటల రాజేందర్ ను ఓడించడం కోసం టిఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలో నిధుల వరద కురిపించింది. పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. అయినప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్ కు పట్టం కట్టారు. ఇక తాజాగా మునుగోడు నియోజకవర్గంలో కూడా అభివృద్ధిపై దృష్టి సారించబోతున్న టిఆర్ఎస్ ఇకపై వేగంగా నిధులు మంజూరు చేయాలని భావిస్తోంది. అయితే హుజురాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి దెబ్బ తగిలినట్టు, మునుగోడులో తగలబోదని గట్టి నమ్మకంతో ఉంది.
Also Read : మునుగోడు ఉప ఎన్నిక… మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం
నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలోనూ సీఎం కేసీఆర్ ప్రకటించిన నిధులు మునుగోడుకు ఇప్పటివరకు మంజూరు కాలేదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినందుకు నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు, ప్రతి మండల కేంద్రానికి 30 లక్షలు, అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక ముఖ్యమంత్రి ప్రకటన మేరకు 844 గ్రామ పంచాయతీలకు 168. 80 కోట్లు, 31 మండలాలకు 9.30 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. ఇక దీనిలో మొత్తం మునుగోడు నియోజకవర్గం లోని 157 గ్రామ పంచాయతీలు 6 మండల కేంద్రాలకు 33.20 కోట్ల విడుదల చేయాల్సి ఉంది కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితి.
Read Also : త్వరలో కాంగ్రెస్ గూటికి కర్నె ప్రభాకర్! నారాయణపురంలో అనుచరులతో మీటింగ్
ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం పనుల ప్రతిపాదనలు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కి పంపాలని సూచించడంతో, ఆయనకు పంపడం ఇష్టం లేక తన ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇక జిల్లా అధికార యంత్రాంగాన్ని కలిసినా పని జరగకపోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే విషయాన్ని అక్కడితో విరమించుకున్నారు. ఇక తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో నియోజకవర్గానికి కేటాయించిన నిధులను విడుదల చేయడానికి టిఆర్ఎస్ పార్టీ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది.
ఇవి కూడా చదవండి :
- డ్రోన్ ‘ఎంక్యూ-9 రీపర్’ ను కొనుగోలు చేయనున్న భారత్….
- బ్రాందీ షాపులో పనికి రాడు.. బీజేపీ కుక్క బిస్కెట్లకు అమ్ముడుపోయాడు! కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్.
- నిరుద్యోగులకు షాక్… సగానికి పైగా పోస్టులు వారితోనే భర్తీ !!
- మునుగోడుపై కాంగ్రెస్ దూకుడు… మధుయాష్కీ చైర్మెన్ గా ప్రచార కమిటి
- మునుగోడు ప్రజలకు ఇక పండుగే… ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా