
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ చిన్న కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి ఆకస్మికంగా మృతి చెందారు. తన నివాసంలో ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఉమా మహేశ్వరి వయసు 52 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉమా మహేశ్వరి.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని బంధువులు చెబుతున్నారు.
ఎన్టీఆర్ కు మొత్తం 11 మంది సంతానం. అందులో ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. అందరిలోనూ చిన్నవారు ఉమా మహేశ్వరి. ఉమా మహేశ్వరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా… పెద్ద కుమార్తెకు గతంలోనే వివాహం చేసిన ఉమా మహేశ్వరి చిన్న కుమార్తెకు కూడా ఇటీవలే పెళ్లి చేశారు. చిన్న కుమార్తె పెళ్లి తర్వాత అనారోగ్యానికి గురైన ఉమా మహేశ్వరి తీవ్ర మానసిన ఒత్తిడికి గురైనట్లు సమాచారం. ఈ ఒత్తిడి తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా సమాచారం. ప్రస్తుతం ఉమా మహేశ్వరి మృత దేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉమా మహేశ్వరి మృతితో ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.