
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ప్రస్తుతం వలసలపర్వం సాగుతోంది. ప్రత్యేకంగా వలస నేతల కోసం బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యేకంగా చేరికల కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. కాంగ్రెస్ చేరికల కమిటీకి సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి సారధ్యం వహిస్తుండగా.. బీజేపీ చేరికల కమిటి కన్వీనర్ గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు. ఇతర పార్టీల్లోని అసమ్మతి నేతలను గుర్తించి తమ పార్టీ వైపు ఆకర్షించడమే ఈ కమిటీల పని. ఆషాడ మాసం తర్వాత తమ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఆషాడమాసం ముగియడంతో కమలం పార్టీలో ఎవరెవరు చేరబోతున్నారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.
వలసలకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైంది. అయితే ముహుర్తం ఇంకా ఫిక్స్ కాలేదు. 15 రోజుల్లో కేసీఆర్ పై యుద్ధం చేస్తానని కోమటిరెడ్డి చెప్పడంతో ఆయన చేరిక రెండు వారాల తర్వాతేనని భావిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లే నేతలంటూ కొన్ని రోజులుగా కొందరిపై ప్రచారం సాగుతోంది. అందులో ముందువరుసలో ఉన్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటితో బీజేపీ పెద్దలు మాట్లాడుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఆయన మాత్రం పార్టీ మార్పు వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా పొంగులేటికి సంబంధించి ఆసక్తికర పరిణామం జరిగింది.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రావడం సంచలనంగా మారింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. శ్రీనివాస్ రెడ్డి, మాధురి దంపతుల కుమార్తె సప్ని రెడ్డికి రామసహాయం సురేందర్ రెడ్డి మనుమడు అర్జున్ రెడ్డితో మ్యారేజీ ఫిక్సైంది. వీళ్ల వివాహ నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్ లోని అప్పా జంక్షన్ కి సమీపంలో గల పొంగులేటి నూతన రిసార్ట్స్ లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దీంతో సప్ని రెడ్డి, అర్జున్ రెడ్డి ఎంగేజ్ మెంట్ వేడుకకు హాజరయ్యారు బండి సంజయ్. వధూవరులను ఆశీర్వదించారు. తమ నివాసానికి వచ్చిన బండికి పొంగులేటి సాదర స్వాగతం పలికారు. పొంగులేటిని పలకరించారు. పొంగులేటితో బండి సంజయ్ చాలా క్లోజ్ గా ఉండటంతో రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి …
- వారం తర్వాత హైదరాబాద్ కు కేసీఆర్.. ఢిల్లీకి ఏం చేసినట్లు?
- పార్టీని బలోపేతం చేస్తేనే 19 లోక్ సభ స్థానాలు… రఘురామకృష్ణంరాజు
- టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అలనాటి స్టార్ హీరోయిన్…
- పాండవులు, కౌరవుల మధ్యే ఎన్నికలు… రాజగోపాల్ రెడ్డి
- కేసీఆర్‌ను రాజకీయంగా ఓడగొట్టకపోతే తన జన్మకకు అర్థం లేదు.. ఈటల