

క్రైమ్ మిర్రర్, సినిమా :
టైటిల్ : పంచతంత్ర కథలు
దర్శకత్వం, స్క్రీన్ ప్లే : గంగనమోని శేఖర్
నిర్మాత : డి.మధు (మధు క్రియేషన్స్)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయికుమార్ పాలకూరి
డైలాగ్స్, లైన్ ప్రొడ్యూసర్ : అజహర్ షేక్
సినిమాటోగ్రఫీ : విజయ్ భాస్కర్ సద్దాల
ఎడిటర్ : శ్రీనివాస్ ఓరగంటి
సంగీతం : సయ్యద్ కమ్రాన్
స్క్రిప్ట్ సహకారం : ప్రవీణ్ కుమార్ సుంకరి
నటీనటులు : నందిని రాయ్, నోయెల్ సియాన్, సాయి రోణాంక్, గీతా భాస్కర్, నిహాల్ కోదాటి, ప్రణీత పట్నాయక్, మిర్చి హేమంత్, సాదియా అన్వర్, అజయ్ కతుర్వార్
ఒక కథను సినిమాగా తీసి తిప్పి తిప్పి ఒకే కథను చెప్తూ వస్తున్న సినిమాలకు భిన్నంగా ఈరోజు విడుదలైన పంచతంత్ర కథలు సినిమా ఆకట్టుకుంది. ఐదు వేర్వేరు కథలతో తాను చెప్పాలనుకున్న విభిన్న అంశాలను తక్కువ నిడివిలో అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు శేఖర్ గంగనమోని సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక కథల విషయానికొస్తే..
Also Read : కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన… భద్రాచలంలో ప్రత్యేక పూజలు
అడ్డకత్తెర :
హీరో, హీరోయిన్లు వేర్వేరు కులాలకు చెందిన వారు. హీరోయిన్ కి తెలియకుండా హీరో ఆమెను ప్రేమిస్తుంటాడు. కానీ.. హీరోయిన్ తండ్రి ఆ ఊరి పెద్ద. ఆమె బాబాయ్ కొంచెం దుడుకు స్వభావంతో కోపిష్టి. హీరోయిన్ ని చూసేందుకు, కలిసేందుకు హీరో పడే తంటాలు నవ్వు తెప్పిస్తాయి. నిత్యం పబ్ జీ గేమ్ లో మునిగిపోయే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కథ మొత్తం నవ్విస్తుంది. పల్లె వాతావరణాన్ని దర్శకుడు బాగా చూపించాడు. కథ మధ్యలో హీరోయిన్ ఇచ్చే ట్విస్ట్ కథను చివరి వరకు చూసేలా చేస్తుంది. అక్కడక్కడా కథ కాస్త సాగినట్టు అనిపించినా.. హీరో ఫ్రెండ్ పాత్ర ఆ లోటును పూడ్చింది. రెండు కుటుంబాలు, రెండు కులాల మధ్య జరిగిన గొడవలో హీరో, హీరోయిన్ల ప్రేమ సక్సెస్ అవుతుందా? లేదా అన్నది తెర మీద చూడాల్సిందే.
Read Also : భార్య కలెక్టర్గా పనిచేసిన జిల్లాకు భర్త కలెక్టర్గా బదిలీ… శుభాకాంక్షలు తెలిపిన భార్య..
అహల్య :
వేశ్యగా మారిన ఓ యువతి పడుపు వృత్తి చేస్తూ తన కొడుకును పోషిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఓ యువకుడు పరిచయమవుతాడు. మొదట్లో తాను కూడా తన దగ్గరికి కస్టమర్ లా వచ్చాడని అనుకున్నా.. అతడి మాటలు విన్న తర్వాత అతడో ట్రావెలర్, పెయింట్ ఆర్టిస్ట్ అని తెలుసుకుంటుంది. చీకట్లో ప్రయాణం అంత మంచిది కాదని వారించి.. ఆ రాత్రికి తన ఇంట్లో పడుకొని పొద్దున్నే వెళ్లిపోదువు అని ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడి నుంచి కథతో పాటు.. ఆ యువతి ఆలోచనా విధానం కూడా మెల్లమెల్లగా మారుతుంది. ఓ దశలో వేశ్యవృత్తిని వదిలేద్దామనుకున్నా.. సమాజం మాత్రం ఆమెను వేశ్యలాగే చూస్తుంది. ఈ క్రమంలో యువకుడు కొన్ని రోజులు వాళ్లింట్లోనే ఉండటం, ఆమె కొడుకు అతడితో కలిసి ఆడుకోవడం సీన్లు బాగున్నాయి. ఆమె అందాన్ని వర్ణించేలా ఆ యువకుడు వేసిన ఒక పెయింట్ ఆమె ఆమె ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. ఇంతకీ.. ఆమె వేశ్య వృత్తిని వదిలేసిందా? ఆ యువకుడు ఏం చేశాడు? కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్ తెర మీద చూడండి.
Also Read : బీ.ఎస్.ఎన్.ఎల్ కు భారీ నిధులను కేటాయించిన కేంద్రం…
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ :
ఇద్దరు ప్రేమికులు ఆర్థిక స్థోమతల కారణంగా విడిపోతారు. అమ్మాయి తండ్రి ఓ ఉన్నత సంబంధం తీసుకొచ్చి ఆమెకు పెండ్లి చేస్తాడు. పెండ్లైన కొన్ని రోజుల తర్వాత తిరిగి సొంతూర్లో స్థిరపడటానికి వచ్చిన అమ్మాయి భర్త టూర్ లో ఉండటంతో తన మాజీ ప్రియుడికి ఫోన్ చేసి కలుద్దామని అడుగుతుంది. పెండ్లైన తర్వాత తొలిసారి కలుద్దాం అని అడగడంతో సరే అని ఆమెని కలుస్తాడు. రెండోసారి మళ్లీ కలుద్దామని అడుగుతుంది. అలా వారిద్దరి మీటింగ్స్ మరోసారి శారీరక కలయికకు దారి తీస్తాయి. ఇంతలో ఆఫీస్ పని మీద బయటకు వెళ్లిన భర్త ఇంటికొస్తున్నాడని తెలిసిన తర్వాత ఆమె తన మాజీ ప్రియుడిని దూరం పెడుతుంది. అతడు కలుద్దామని ప్రయత్నించినా ఎవాయిడ్ చేస్తుంది. ఈ క్రమంలో ఓరోజు మాజీ ప్రియుడు నేరుగా ఇంటికి వచ్చి తనకు ఎయిడ్స్ ఉందని చెప్తాడు. ఆ మాట విన్న ఆమె షాక్ కి గురవుతుంది. ఆ మరుసటి రోజే భర్త టూర్ నుంచి ఇంటికి వస్తాడు. సెక్స్ కోసం కలుద్దామని అడిగితే భర్తకు కూడా ఎయిడ్స్ సోకుతుందని భయపడుతుంది. ఆ టెన్షన్ లో భర్తను దూరంగా నెట్టివేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది?
Read Also : ముందే వచ్చిన జెండా పండుగ….
నర్తనశాల :
హీరో ఓ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్ నడిపిస్తుంటాడు. డ్యాన్స్ నేర్పడమే ప్రాణంగా కోచింగ్ ఇనిస్టిట్యూట్ నడుపుతుంటాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయి డ్యాన్స్ కోచింగ్ ఇస్తారా అంటూ హీరోకి కాల్ చేస్తుంది. ఫోన్లోనే అన్నీ వివరాలు అడుగుతుంది. దానికి హీరో.. ఇనిస్టిట్యూట్ కి వస్తే అన్నీ వివరాలు తెలుసుకోవచ్చు అంటూ సమాధానమిస్తాడు. కానీ.. ఆ అమ్మాయి ఇనిస్టిట్యూట్ కి రాకుండా తరచూ ఫోన్ చేసి హీరోని విసిగిస్తుంది. ఈ ఫోన్ కాల్స్ లోనే వారి మధ్య చనువు పెరిగిపోతుంది. అవతలి వైపు అమ్మాయి కావడం, ఆమె గొంతు స్వీట్ గా ఉండటంతో హీరో తనకు తెలియకుండానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఒకానొక రోజు ఆమెను చూడాలనిపిస్తుంది అని అడుగుతాడు. ఆమె పంపిన ఫొటో చూసి ఆమెను ప్రాణంగా ఇష్టపడటం మొదలుపెడుతాడు. ఇద్దరూ ఫోన్ లోనే ప్రేమించుకుంటుండగా.. కథ క్లైమాక్స్ కి వస్తుంది. సాగరతీరంలో ఇద్దరు కలుద్దామనుకుంటారు. ఇన్నిరోజుల నిరీక్షణకు తెరపడనుందన్న సంతోషంతో హీరో ముందుగానే సాగరతీరంలో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే తాను వస్తుంది. తీరా ఆమెను చూశాక హీరో షాక్ కి గురవుతాడు? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని చూసి హీరో ఎందుకు షాకయ్యాడు? ఆ తర్వాత ఏమయింది? థియేటర్ లో చూడండి.
Also Read : ఖమ్మం పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి….
అనగనగా :
ఐదుకథల్లో నాలుగు కథలు ఒకెత్తయితే.. చివరి కథ ఇంకో ఎత్తు. నేటి బంధాలన్నీ ఆర్టిఫిషియల్ గా ఎలా మారిపోతున్నాయో చెప్పేందుకు తల్లీకొడుకుల బంధాన్ని ఎంచుకున్న దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని ఆమె వృద్ధాప్యంలో బాధ్యతగా చూసుకోవాల్సిన కొడుకులు… నేటి సమాజంలో నువ్వు కొన్ని రోజులు పోషించు.. నేను కొన్ని రోజులు పోషిస్తా అని తల్లి పోషణను పంచుకోవడం అనే పాయింట్ లో దర్శకుడు శేఖర్ చెప్పిన కథ సినిమా చూసిన ప్రతి ఒక్కరి గుండెలను తడుముతుంది. అమ్మ క్యారెక్టర్ చేసిన తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ నటన సెటిల్డ్ గా ఉంది. మిగతా కథల్లో డైలాగులు కథకు, సీన్ కి తగ్గట్టుగా ఆకట్టుకుంటాయి. కానీ.. ఈ కథలోని డైలాగులు నిజ జీవితంలో నిత్యం మన కండ్ల ముందు కనిపించే సన్నివేశాలే. ఒక కథతో నవ్వించి.. మరో కథతో కవ్వించి.. చివరి కథతో మనసును కదిలించాడు దర్శకుడు శేఖర్ గంగనమోని.
రేటింగ్ : 5/3.5
ఇవి కూడా చదవండి :
- మునుగోడుకు ఉపఎన్నిక వస్తే…. అధికార పార్టీలో మొదలైన భయం??
- అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలో కోమటిరెడ్డి! గంటకో ట్విస్ట్ తో రాజకీయ రచ్చ..
- మూడు నెలల క్రితం MLA స్టిక్కర్ పడేశాడట!.. మంత్రి మల్లారెడ్డి కవరింగ్ అదుర్స్..
- ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారు? పీకే టీమ్ తుది నివేదిక ఇచ్చిందా? అసెంబ్లీ రద్దు అప్పుడేనా?