
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈడీ సోదాల్లో దొరికిన ఆధారాల ఆధారంగా కొత్త కొత్త లింకులు బయటపడుతున్నాయి. ఇప్పటికే క్యాసినోకు వచ్చిన కస్టమర్ల సరదా కోసం సినీ సెలబ్రిటీలను చీకోటి ఏర్పాటు చేసేవాడని గుర్తించారు. టాలీవుడ్, బాలీవుట్ తారలకు ప్రవీణ్ నజరానాగా ఇచ్చిన డబ్బుల వివరాలు బయటికి వచ్చాయి. ఏపీ, తెలంగాణ చెందిన కొందరు మంత్రులు, కొందరు మాజీ మంత్రులు, దాదాపు 20 మంది వరకు ఎమ్మెల్యేలతో చీకోటి ప్రవీణ్ కు లింకులు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో చీకోటితో సంబంధాలున్న ప్రజాప్రతినిధులు ఎవరన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.
ఏపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, సీఎం జగన్ దగ్గరి బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చీకోటి ప్రవీణ్ తో సంబంధాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయం ఖండించారు. తనకు క్యాసినోలకు వెళ్లే అలవాటు ఉందన్నారు. అప్పుడప్పుడు వెళుతూ ఉంటానన్నారు. తాను పేకాడ ఆడుతానని కూడా బాలినేని తేల్చి చెప్పారు. అయితే క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అతను నడిపిన హవాలా వ్యవహరాలతోనూ తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను ఏ విషయంలో అయినా నిక్కచ్చిగానే ఉంటానన్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెబుతానని.. డ్రామాలు చేయడం తనకు తెలియదన్నారు బాలినేని. తనకు చీకోటి ప్రవీణ్‌తో సంబంధాలు ఉన్నాయని ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే చూపించాలని.. తాను ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టీవీలు, పేపర్‌లలో తన పేరు బయటకు తీసుకువచ్చి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తనపై బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.
చికోటి ప్రవీణ్ వ్యవహారానికి సంబంధించి గంటకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. అతని ఫామ్ హౌజ్ లో ఫారెస్ట్ అధికారులు సోదాలు చేశారు. నిబంధనలకు విరుద్దంగా వన్యప్రాణులను బంధించడం నేరమన్నారు. ఫైథాన్ ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని.. కాని చీకోటి ప్రవీణ్ ఫాంహౌజ్ లో ఫైథాన్ తమకు కనిపించలేదని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డిలను ఆగష్టు 1వ తేదీన విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. ఇద్దరి నివాసాల్లో దాదాపు 20 గంటలపాటు జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది. చీకోటి ప్రవీణ్ కు చెందిన ల్యాప్ టాప్ ను మొబైల్ ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.
One Comment