
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ తో పాటు రాష్ట్రంలో కాక రేపుతున్న సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో రాజకీయ రచ్చ కంటిన్యూ అవుతోంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారని ఆ పార్టీ అధ్యక్షుడు చెబుతుండగా… రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని సీఎల్పీ నేత తెలిపారు. దీంతో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఇంతకీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేక కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నట్లు కాషాయ కండువా కప్పుకుంటారా అన్నది తేలడం లేదు. అదే సమయంలో పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా చేయరా అన్నద తేలడం లేదు. గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తుండటంతో కోమటిరెడ్డి అనుచరులు కూడా ఏం జరుగుతుందో తెలియక గందరగోళంలో పడ్డారు.
Read More : మూడు నెలల క్రితం MLA స్టిక్కర్ పడేశాడట!.. మంత్రి మల్లారెడ్డి కవరింగ్ అదుర్స్..
కోమటిరెడ్డి బీజేపీలో చేరడానికి ముహుర్తం ఖరారైందని… బండి సంజయ్, ఈటెల, వివేక్ తో కలిసి ఢిల్లీకి వెళుతున్నారనే వార్తలు వచ్చాయి. ఇంతలోనే కాంగ్రెస్ హైకమాండ్ సీన్ లోకి ఎంటరైంది. పీసీసీ నేతలతో ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన భేటీలో రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం చేయాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. కోమటిరెడ్డి లాంటి బలమైన నేతను వదులుకోవద్దని నిర్ణయించిన హైకమాండ్… ఆయనను బుజ్జగించే బాధ్యతలను ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించింది. పార్టీ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ గా పేరున్న దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపింది. వైఎస్సార్ హయాంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు సన్నిహితంగా ఉన్నారు డిగ్గీరాజా. అప్పటి నుంచి ఆ బంధం కొనసాగుతోంది. దీంతో రాజగోపాల్ రెడ్డిని పార్టీలో ఉంచేలా దిగ్విజయ్ ప్రయత్నిస్తున్నారు. ఆయన రాజగోపాల్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు. సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుందామని.. తొందరపడవద్దని సూచించారు.
కాంగ్రెస్ యాక్షన్ తో ఇటు బీజేపీ అప్రమత్తమైంది. బీజేపీలో చేరేలా కోమటిరెడ్డిపై ఒత్తిడి పెంచుతుందని తెలుస్తోంది. పార్టీ మార్పుపై త్వరగా జరిగిపోవాలని చెబుతున్న కమలం నేతలు ఓ కండీషన్ కూడా పెట్టారని తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే బీజేపీలో చేరాలని ఖరాఖండిగా చెప్పేశారట. దీంతో ఏం చేయాలో తెలియక రాజగోపాల్ రెడ్డి అయోమయంలో పడ్డారని అంటున్నారు. బీజేపీలో చేరాలని భావిస్తున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా విషయంలో ఆయన డైలామాలో ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం రాజగోపాల్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాకే బీజేపీలో చేరాలని భావించారు. సస్పెండ్ చేయాలనే పీసీసీ నేతలను టార్గెట్ చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం స్పందించడం లేదు. సస్పెండ్ చేయకుండా నాన్చుతోంది. ఇదే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఇరకాటంలో పెడుతుందని అంటున్నారు.
Read More : ఫిలిప్పీన్స్ ఉత్తర భాగంలో భారీ భూకంపం…
మునుగోడు నియోజకవర్గ నేతలతో సమావేశమైన రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికపై చర్చించారట. అయితే మెజార్టీ నేతలు ఉపఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి గెలవడం అంత ఈజీ కాదని చెప్పేశారట. అంతేకాదు ఆయనతో పాటు బీజేపీలో చేరేందుకు మెజార్టీ నేతలు ముందుకు రావడటం లేదట. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై రాజగోపాల్ రెడ్డి వెనుకాడుతున్నారని తెలుస్తోంది. బీజేపీ మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే పార్టీలో చేరాలని చెబుతుండటంతో రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి …
- రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ ఫోన్… ఢిల్లీకి రావాలని పిలుపు
- నదిలో దంపతుల మృతదేహాలు లభ్యం….
- జంట జలాశయాల్లోకి పెరుగుతున్న వరద ప్రవాహం
- విశాఖ వివాహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. ప్రియుడితో నెల్లూరులో ప్రత్యక్షం
- ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధికే వైసీపీ మద్దతు….
2 Comments