
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కాలికి గాయమైంది. ప్రగతి భవన్ లో కిందపడటంతో ఆయన ఎడమ కాలు మడిమకు గాయమైంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు మంత్రి కేటీఆర్. . కాలుకు పట్టి కట్టిన ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. మూడు వారాల పాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు తేల్చిచెప్పినట్టు కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ మూడు వారాల పాటు ఇంట్లో ఖాళీ సమయం బోర్ కొట్టకుండా ఉండటం కోసం ఓటిటి మాధ్యమాల్లో వీక్షించేందుకు ఏవైనా మంచి టైమ్‌పాస్ షోలు ఉంటే చెప్పండి అంటూ నెటిజెన్స్‌ని కోరారు.
మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేసిన ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. కేటీఆర్ అడిగిన సలహాకు నెటిజెన్స్ నుంచి భిన్నరకాల సమాధానాలు లభిస్తున్నాయి. ఆదివారం మంత్రి కేటీఆర్ బర్త్‌డే కూడా కావడంతో కొంత మంది మంత్రికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే చెబుతూ గెట్ వెల్ సూన్ అని సందేశాలు పంపితే.. ఇంకొంత మంది తమకు తోచిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల పేర్లు చెబుతున్నారు. కొంత మంది నెటిజెన్స్ కేటీఆర్ అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం చెబితే.. ఇంకొంత మంది తమదైన స్టైల్లో రిప్లై ఇస్తున్నారు.