
తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం తీన్మార్‌మల్లన్న. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగారు. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా కేవలం సోషల్‌మీడియానే ఆయుధంగా చేసుకొని జనానికి దగ్గరయ్యారు మల్లన్న. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. గత ఏడాది జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసి అధికార పార్టీకి చుక్కలు చూపించారు. స్వతంత్రంగా గెలిచినంత పనిచేశారు.అప్పటినుంచి తీన్మార్ మల్లన్న పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిచెందాక మరింత దూకుడు పెంచారు తీన్మార్ మల్లన్న. టీఆర్ఎస్ ప్రభుత్వం పై ఏకంగా యుద్ధమే ప్రకటించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజూ కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై పదునైన విమర్శలు చేశారు. దీంతో మల్లన్నను టార్గెట్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అరెస్ట్ చేసి జైల్లో వేసింది. దాదాపు రెండు నెలల పాటు జైల్లో ఉన్న మల్లన్న అతికష్టంమీద బెయిల్‌పై విడుదలయ్యారు.
జైల్లో ఉన్నప్పుడు బీజేపీ ఆయనకు తోడుగా నిలిచింది. ఎంపీ ధర్మపురి అర్వింద్ .. మల్లన్న భార్యను అమిత్‌షా వద్దకు తీసుకెళ్లి పరిస్థితిని వివరించారు. మల్లన్న విడుదల కోసం తనవంతు ప్రయత్నం చేశారు. దీంతో జైలు నుంచి విడుదలైన తర్వాత బీజేపీలో చేరారు తీన్మార్ మల్లన్న. కొంతకాలం ఆ పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. ఆ తర్వాత ఏంజరిగిందో కానీ.. మల్లన్న క్రమంగా కమలం పార్టీకి దూరమయ్యారు. కొంత కాలం కింత తన మద్దతుదారులతో జరిగిన కార్యక్రమంలో ఇక బీజేపీ పార్టీ ఆఫీసు గడపతొక్కనని ప్రకటించారు అప్పటినుంచి బీజేపీకి అధికారికంగా రాజీనామా చేయకున్నా… పార్టీ కార్యక్రమాల్లో మాత్రం మల్లన్న పాల్గొనడంలేదు. ప్రజలతో మమేకమవుతూ సమస్యలపై పోరాటంచేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబపాలనపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు.
యూత్‌లో బాగా ఫాలోయింగ్ ఉన్న తీన్మార్ మల్లన్న ఇప్పుడు మరోపార్టీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల తన ఛానెల్ లో పవన్ కళ్యాణ్‌ను పొగుడుతూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలాన్నిస్తున్నాయి. తెలంగాణలోనూ తన పార్టీని విస్తరించాలని చూస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్… తీన్మార్ మల్లన్న ఫాలోయింగ్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాడట. అటు తనకు కూడా ఏదోఒక పార్టీ అండ ఉండాలని భావిస్తున్న మల్లన్న కూడా పవన్ ఆఫర్‌పట్ల కాస్త సుముఖంగానే ఉన్నట్లు టాక్. దీనిలో భాగంగానే తన ఛానెల్‌లో ఈ మధ్య పవన్ కళ్యాణ్ పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారని ఆయన అభిమానులు అంటున్నారు. పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఏపీలో బలం అంతా కాపు సామాజిక వర్గమే. తీన్మార్ మల్ల్నన కూడా కాపే. అందుకే ఇద్దరు కలిసిపోవాలని నిర్ణయించారని తెలుస్తోంది. తెలంగాణలో కాపు సామాజిక వర్గం ఓట్లు భారీగా ఉన్నాయి. దాదాపు 30 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. అందుకే తీన్మార్ మల్లన్నకు తెలంగాణ జనసేన బాధ్యతలు అప్పగించాలని పవన్ కల్యాణ్ డిసైడ్ అయ్యారని అంటున్నారు.
పవన్ ఎప్పటికైనా సీఎం అవుతారన్న మల్లన్న వ్యాఖ్యలు అందులో భాగమేనని చెబుతున్నారు. ప్రతి జనసేన కార్యకర్త పదిఇళ్లలో ప్రచారం చేస్తే పవన్ అధికారంలోకి వస్తారని మల్లన్న ఓ సలహాకూడా ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే మల్లన్న జనసేన కండువా కప్పుకోవడం ఖాయమని సమాచారం. తెలంగాణ రాజకీయాలపై పవన్ మంచి అవగాహనతోనే ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో తమకు రెండు మూడు వేల ఓట్లైతే ఖచ్చితంగా ఉన్నాయని .. దానికి ఇలా మరొక అండ తోడైతే వచ్చే ఎన్నికల నాటికి పట్టు పెంచుకోవచ్చన్నది పవన్ వ్యూహమని తెలుస్తోంది.
One Comment