
తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం రాజుకుంటోంది. ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలతున్నాయి.పోలవరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. పువ్వాడ అనవసర విమర్శలు మానుకోవాలన్నారు. విలీన గ్రామాల ప్రజల కోసం ఏం చేయాలో తమకు తెలుసని చెప్పారు. విలీన గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే..ఏపీని కూడా తెలంగాణలో కలపాలని అడుగుతామన్నారు.
ఏపీ ఆదాయం తగ్గింది..హైదరాబాద్‌లో కలిపేస్తారా అని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. విలీన గ్రామాల ప్రస్తావన తెస్తే ఏపీని హైదరాబాద్‌లో కలపాలన్న డిమాండ్‌ను తీసుకొస్తామన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ రెండు రాష్ట్రాల ఏర్పాటును మంత్రి బొత్స సమర్థించారు. ఐతే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గోదావరి వరదలతో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టు వల్ల భద్రాచలం ముంపునకు గురైందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం తెలంగాణలోని ఏడు మండలాలను గతంలో ఏపీలో కలిపిన విషయాన్ని గుర్తు చేశారు. వాటిలో కొన్ని గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో దీనిని ప్రస్తావిస్తామన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలన్నారు.
3 Comments